calender_icon.png 2 February, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వేకు 2.55 లక్షల కోట్లు

02-02-2025 12:31:19 AM

గతేడాది కేటాయింపులు రూ.2.62 లక్షల కోట్లు

  1. ఈసారి కాస్త తగ్గించి రైల్వే బడ్జెట్ కేటాయింపులు
  2. ‘కవచ్ అప్‌గ్రేడ్ వెర్షన్ 4.O’పై స్పష్టత కరువు 
  3. మూడు రైల్వే ఆర్థిక కారిడార్ల ప్రస్తావనే లేదు..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: భారత రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు, తూర్పు నుంచి పడమర వరకు కొన్నివేల కిలోమీటర్ల మేర రైల్వేశాఖ దేశ ప్రజలకు అత్యుత్తమ రవాణా సేవలు అందిస్తున్నది. మొత్తానికి రైల్వేశాఖ ఇండియన్ రవాణావ్యవస్థకు గుండెకాయ.

అందుకే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో రైల్వేస్‌కు ప్రాధాన్యమిస్తుంది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైల్వేశాఖకు బడ్జెట్‌లో రూ.2.55 లక్షల కోట్లు కేటాయించింది. దీనిలో మూలధన వ్యయం రూ.2,52,000 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ.3,445 వేల కోట్లు.

గతేడాది కేంద్రం రైల్వేస్‌కు రూ2.62 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి కాస్త తగ్గించడం గమనార్హం. గతేడాది కేటాయింపుల్లో రైల్వేశాఖ సుమారు 80శాతం నిధులను ఖర్చు చేసింది. 

అదనపు వనరులు సైతం..

రైల్వేశాఖకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.2.55 లక్షల కోట్లతో పాటు అదనపు ఆదాయ మార్గాలూ ఉన్నాయి. రైల్వేశాఖకు అంతర్గత వనరుల నుంచి రూ.3 వేల కోట్లు, అదనపు బడ్జెట్ వనరుల నుంచి రూ.10 వేల కోట్లు, నిర్భయ ఫండ్ నుంచి మరో రూ.200 కోట్లతో పాటు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నుంచి కూడా కొంత ఆదాయం వస్తుంది. బడ్జెట్ కేటాయింపులతో పాటు వీటన్నింటిని కలుపుకొంటే రైల్వేశాఖ చేతిలో ఒక్క ఏడాదిలో రూ.3 లక్షల కోట్లు ఉన్నట్లు లెక్క.

రైలు ప్రమాదాల నివారణపై దృష్టి ఏది?

రైలు ప్రమాదాల నివారణపై రైల్వేశాఖ ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉన్నదనే అభిప్రాయం నిపుణు ల నుంచి వ్యక్తమవుతున్నది. ప్రమాదాల నివారణకు రైల్వేశాఖ దేశంలోని ప్రధాన రైల్వే మార్గాలైన ఢిల్లీ - ముంబై, ఢిల్లీ -కోల్‌కతా, ముంబై - చెన్నై, చెన్నై- కోల్‌కతా రైల్వే లైన్ల పరిధిలోని 9 వేల కిలోమీటర్ల మేర ‘కవచ్ అప్‌గ్రేడ్ వెర్షన్ 4.Oను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉన్నది. కానీ.. ఈ బడ్జెట్‌లో దీనికి సంబంధించిన ప్రకటనేమీ లేదు. 

కేటాయింపుల తగ్గింపుపై నిరాశ..

వాస్తవానికి గతేడాది కంటే ఈసారి బడ్జెట్‌లో రైల్వేస్‌కు 15 నుంచి 20శాతం వరకు ఎక్కువ కేటాయింపులు ఉంటాయని రైల్వేశాఖ ఉన్నతాధికారులు అంచనా వేశారు. కానీ.. ఆంచనాలన్నీ తారుమారయ్యాయి. కేంద్ర ప్రభుత్వం గతేడాది కంటే ఈసారి కేటాయింపులను కొంచెం తగ్గించడంతో అధికారులు నిరాశ చెందారు. 

మూడు కారిడార్ల ఊసేది ?

గతేడాది బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం కొప్పర్తి రైల్వే ఆర్థిక కారిడార్‌లో భాగంగా విశాఖపట్నం - చెన్నై, ఓర్వకల్లు రైల్వే కారిడార్‌లో భాగంగా హైదరాబాద్ - బెంగళూరు, గయ రైల్వే కారిడార్‌లో భాగంగా అమృత్‌సర్ - కోల్‌కతా రైల్వేలైన్ల అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఆయా లైన్లను పారిశ్రామిక  ప్రాంతాలకు అనుసంధానం చేస్తామని, అందుకు తగిన విధంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది.  కానీ.. ఈ బడ్జెట్‌లో మూడు రైల్వే కారిడర్లపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

నిధుల వ్యయం ఇలా..

కేంద్ర రైల్వేశాఖ పింఛన్ ఫండ్‌కు రూ.66 వేల కోట్లు, 

కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రూ.32,235 కోట్లు, 

రైల్వేలైన్ల డబ్లింగ్‌కు రూ.32 వేల కోట్లు, 

గేజ్ లైన్ల మార్పునకు రూ.4,550 కోట్లు, 

రైల్వే సిగ్నలింగ్, టెలికా పనులకు రూ.6,800 కోట్లు, 

విద్యుత్ లైన్లకు రూ.6,150 కోట్లు, 

సిబ్బంది సంక్షేమానికి రూ.833 కోట్లు, 

సిబ్బంది శిక్షణకు రూ.301 కోట్లు, 

రైల్వే భద్రతా నిధికి రూ.45 వేల కోట్లు