calender_icon.png 23 January, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వేలకు 2.62 లక్షల కోట్లు

24-07-2024 12:55:16 AM

రైల్వేల భద్రతకే సగం నిధులు

మౌలిక వసతులకు పెద్దపీట

ప్రమాదాలు నివారించే కవచ్‌లు దేశవ్యాప్తం

వెల్లడించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

న్యూఢిల్లీ, జూలై 23: వార్షిక బడ్జెట్‌లో రైల్వేలకు రూ. 2.62 లక్షల కోట్లు కేటాయింపులు జరిపినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వేలకు అత్యధిక నిధులు కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ మొత్తంతో రైల్వేలో భద్రతా వ్యవస్థల మెరుగు, కవచ్ ఇన్‌స్టలేషన్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.

బడ్జెట్ ప్రసంగం అనంతరం రైల్వేకు సంబంధించిన కేటాయింపులపై అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి బడ్జెట్‌లో రైల్వేలకు రూ.2,62,200 కోట్లు కేటాయించగా.. అందులో రూ. 1.08 లక్షల కోట్లు రైల్వే భ్రదతకు వినియోగించనున్నట్లు తెలిపారు. పాత ట్రాకుల స్థానే కొత్తవి ఏర్పాటు, సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం, కవచ్ వ్యవస్థ ఇన్‌స్ట్టాలేషన్ ఇందులో ఉన్నాయన్నారు.

ప్రయాణికుల రక్షణే ప్రధాన కర్తవ్యమన్న మంత్రి.. అన్నింటిలో కల్లా కవచ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇటీవలే కవచ్ 4.0కు ఆమోదం లభించిందని, ఇన్‌స్టాలేషన్ త్వరతిగతిన చేపడతామని వెల్లడించారు. యూపీఏ హయాంలో రైల్వేలకు అరకోర కేటాయింపు ఉండేవని అశ్విని వైష్ణవ్ గుర్తుచేశారు. 2014లో యూపీఏ ప్రభుత్వం రైల్వేకు రూ.35 కోట్లు మాత్రమే కేటాయించిందని.. ఇప్పుడా మొత్తం రూ.2.62 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. 2014 ముందు 60 ఏళ్లలో దేశ వ్యాప్తంగా 20 వేల కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని మాత్రమే విద్యుదీకరిస్తే.. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన పదేళ్లలోనే 40 వేల కిలోమీటర్ల విద్యుదీకరణ పూర్తి చేశామని వివరించారు. 

2014లో సగటున రోజుకు 4 కిలోమీటర్ల మేర ట్రాకుల నిర్మాణం జరగగా.. ఇప్పుడు సగటున రోజుకు 14.5 కిలోమీటర్ల ట్రాకులు నిర్మితమవుతున్నాయని చెప్పారు. మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకుని ఒక్కో రైలులో మూడింట రెండొంతులు సాధారణ కోచ్‌లు, ఒక వంతు ఏసీ కోచ్‌లు ఉండేలా చూస్తున్నట్లు వైష్ణవ్ చెప్పారు. జనరల్ కోచ్‌లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 2,500 అదనపు జనరల్ కోచ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నామని, మరో 10వేల సాధారణ కోచ్‌ల తయారీ చేపట్టనున్నామని చెప్పారు. ఈ రెండింటికీ బడ్జెట్‌లో కేటాయింపులు జరిగినట్లు తెలిపారు. యూపీఏ హయాంలో రైల్వే పరిధిలో 4.11 లక్షల కోట్ల ఉద్యోగాలు కల్పించగా.. నరేంద్ర మోదీ నేతృత్వంలో గడిచిన పదేళ్లలో 20 శాతం అధికంగా ఉద్యోగ కల్పన జరిగిందని అశ్విని  వైష్ణవ్ చెప్పారు.