calender_icon.png 26 October, 2024 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్కరోజులో 9.20 లక్షల కోట్ల సంపద ఆవిరి

23-10-2024 12:00:00 AM

  1. నిలువునా పతనమైన స్టాక్స్
  2. సెన్సెక్స్ 930 పాయింట్లు డౌన్
  3. 24,500 పాయింట్ల దిగువకు నిఫ్టీ

ముంబై, అక్టోబర్ 22: అడ్డూఆపూలేని విదేశీ ఫండ్స్ అమ్మకాలతో మంగళవారం స్టాక్ మార్కెట్ అతలాకుతలమయ్యింది. ఈ ఒక్క రోజులోనే రూ. 9.20 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. చిన్న, పెద్ద షేర్లు అని చూడకుండా స్టాక్స్‌కు వదిలించుకుని ఇన్వెస్టర్లు పరుగులు తీసారంటే అతిశ యోక్తి కాదు.

ముఖ్యంగా చిన్న షేర్లు విలవిలలాడాయి. హెవీవెయిట్స్‌లో చివరకు ఇటీవల బోనస్ షేర్లను ఆఫర్ చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్లో సైతం భారీ అమ్మకాలు వెల్లువెత్తాయి. దీనితో స్టాక్ సూచీలు రెండు నెలల కనిష్ఠస్థాయికి కుదేలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్    930 పాయిం ట్ల భారీ నష్టంతో 80,220 పాయింట్ల వద్ద నిలిచింది.

ఈ ఏడాది ఆగస్టు 14 తర్వాత ఇంతటి కనిష్ఠస్థాయిలో ముగియడం ఇదే ప్రధమం  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ వరుసగా కీలక సాంకేతిక మద్దతుస్థాయిలైన 24,700, 24,500 పాయింట్ల దిగువకు పడిపోయింది.  చివరకు 309 పాయింట్లు నష్టంతో  కీలకమైన 24,500  పాయింట్ల దిగువన 24, 472 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.

అంతర్జాతీయ సంకేతాల బలహీనత, యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరుగుదల, విదేశీ ఫంద్స్ భారత్ నుంచి పెట్టుబడుల్ని చైనాకు మళ్లించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని  విశ్లేషకులు చెప్పారు. తాజా మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.9,19,374 కోట్లు క్షీణించి రూ. 4,44,45,649 కోట్లకు (5.29 ట్రిలియన్ డాలర్లు) పడిపోయింది. 

ఆగని ఎఫ్‌పీఐల అమ్మకాలు

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐలు) విక్రయాలు మంగళవారం సైతం కొనసాగాయి. తాజాగా ఎఫ్‌పీఐలు రూ.3,978 కోట్ల విలువైన షేర్లు విక్రయించినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

ఎం అండ్ ఎం టాప్ లూజర్

సెన్సెక్స్-30 ప్యాక్‌లో అన్నింటికంటే అధికంగా  మహీంద్రా అండ్ మహీంద్రా అధికంగా 3.80  నష్టపోయింది.  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, లార్సన్ అండ్ టుబ్రో, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 శాతం వరకూ తగ్గాయి. 

మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, ఇన్ఫోసిస్‌లు స్వల్ప లాభాలతో ముగిసాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 3.51 శాతం పడిపోయింది. రియల్టీ ఇండెక్స్ 3.39 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 2.80 శాతం, పవర్ ఇండెక్స్ 2.64 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.52 శాతం,  స్మాల్‌క్యాప్ సూచి 3.81 శాతం చొప్పున పతనమయ్యాయి.