calender_icon.png 2 February, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణాభివృద్ధికి 2.66 లక్షల కోట్లు

02-02-2025 02:04:37 AM

  1. రక్షణ రంగం తర్వాత అత్యధిక కేటాయింపులు
  2. గత బడ్జెట్ కంటే రూ.86వేల కోట్లు అధికం
  3. గ్రామీణుల శ్రేయస్సు,వలసల నివారణే లక్ష్యంగా కొత్త పథకం
  4. ఉపాధి హామీకి గత బడ్జెట్ కేటాయింపులే..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్-2025లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.2,66,817 లక్షల కోట్లు కేటాయించారు. రక్షణ రంగం తర్వాత రెండో అత్యధిక కేటాయింపులు ఈ శాఖకే దక్కాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1,80,228 కోట్లు మాత్రమే కేటాయించారు.

గతం కంటే 86వేల కోట్ల రూపాయలు కేటాయించడం విశేషం. ఆర్థిక సర్వే 2024-25లో పేర్కొన్నట్టుగా.. గ్రామీణుల జీవనోపాధిని పెంపొందించడంతో పాటు గ్రామీణ గృహాలు, తాగునీరు, పారిశుధ్యం, స్వచ్ఛమైన ఇంధనం, సామాజిక రక్షణ, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడం ద్వారా ఈ విషయంలో వివిధ చర్యలు తీసుకున్నారు. 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో సమర్పించిన నివేదికలో గ్రామీణ కుటుంబాలు, చిన్న వ్యాపారాల బ్యాలెన్సింగ్ అవసరాలను మైక్రో ఫైనాన్స్ సంస్థలు, స్వయం సహాయక బృందాలు(ఎస్‌హెచ్‌జీ), ఇతర ఆర్థిక మధ్యవర్తుల ద్వారా తీర్చబడుతున్నాయని పేర్కొంది. 

గ్రామీణుల శ్రేయస్సు, వలసలు తగ్గింపు..

గ్రామీణ ప్రాంతాలలో కొత్త అవకాశాలను సృష్టించడం, వలసలు తగ్గించడమే లక్ష్యంగా రూరల్ ప్రాస్పరిటీ ప్రోగ్రామ్(గ్రామీణ శ్రేయస్సు కార్యక్రమం)ను ఈ బడ్జెట్‌లో ప్రాధాన్య అంశంగా తీసుకున్నారు. కార్యక్రమం కింద 100 జిల్లాల్లో గ్రామీణ నిరుద్యోగాన్ని తగ్గించేందుకు శిక్షణ, సాంకేతికతను అందించనున్నారు. 

జలజీవన్ మిషన్ పొడిగింపు..

జల్‌జీవన్ మిషన్‌ను 2028 వరకు పొడిగించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వ నిబద్ధతను చాటుతున్నాయి. ఈ పథకానికి 67వేల కోట్లు కేటాయించారు. ఇప్పటికే 15 కోట్ల గ్రామీణ కుటుంబాలకు తాగునీటిని అందించిన ఈ మిషన్ 2028 నాటికి వంద శాతం కవరేజీ లక్ష్యంగా పెట్టుకుంది. మౌలిక సదుపాయాల నాణ్యత, గ్రామీణ పైపుల నీటి సరఫరా వ్యవస్థల స్థిరత్వంపై దృష్టి సారించింది.  

వృద్ధి ఉత్ప్రేరకాలుగా గ్రామీణ తపాలా కార్యాలయాలు..

15 లక్షల గ్రామీణ తపాలా కార్యాలయాలతో ఇండియా పోస్ట్‌ను లాజిస్టిక్స్ దిగ్గజంగా మార్చడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ కార్యాలయాలను వృద్ధికి ఉత్ప్రేరకాలుగా మార్చడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. అసొంలో యూరియా ప్లాంట్ ఏర్పాటు వంటి కార్యక్రమాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

వికసిత భారతమే లక్ష్యంగా..

 అవస్థాపన అభివృద్ధి ఏకీకరణ, వ్యవసాయానికి ఆర్థిక మద్దతు, ఎంఎస్‌ఎంఈల పెంపుదల ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి బలమైన నిబద్ధతను చాటుతున్నాయి. వికసిత భారత్ కోసం ఈ బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.

పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో అవకాశాలను సృష్టించే లక్ష్యంతో కీలకరంగాల్లో కేంద్రీకృత పెట్టుబడులు పెట్టింది. గ్రామీణ, పట్టణ భారత దేశం రెండింటి అవసరాలను పరిష్కరించడం ద్వారా, వారి భౌగోళిక స్థానంతో సంబంధం లేకుండా పౌరులందరికీ వృద్ధి ప్రయోజనం చేకూర్చేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఉపాధి హామీ కేటాయింపులు 86వేల కోట్లు..

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కేటాయింపులో ఎలాంటి మార్పు చేయలేదు. గత బడ్జెట్‌లో కేటాయించినట్టుగానే రూ.86 వేల కోట్లు కేటాయించారు. ఈ పథకం దేశంలో ఇప్పటివరకు ప్రవేశపెట్టబడిన అత్యంత విస్తృతమైన గ్రామీణ ఉపాధి కార్యక్రమంగా నిలిచింది.

అధికారిక లెక్కల ప్రకారం..ఈ పథకం గ్రామీణ కుటుంబాలను గణనీయంగా ప్రభావితం చేసింది. 2024-25లో 13.4 కోట్ల మంది క్రియాశీల కార్మికులు ఉన్నారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 8.84 కోట్ల అస్తులను కలిగి ఉంది.