calender_icon.png 2 February, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్షణకు 6.81 లక్షల కోట్లు

02-02-2025 12:05:07 AM

  1. గతేడాది కేటాయింపులు రూ.6.21 లక్షల కోట్లు
  2. ఈసారి 9.5శాతం పెంచుతూ కేటాయింపులు
  3. ‘మేక్ ఇన్ ఇండియా’పై ప్రత్యేక దృష్టి
  4. స్వదేశీ డిఫెన్స్ ఉత్పత్తి పెంచేందుకు కేటాయింపులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశ భద్రతలో రక్షణశాఖ అత్యంత కీలకం. రక్షణశాఖ ప్రభావవంతంగా పనిచేస్తేనే, దేశ పౌరులు అంత సురక్షితంగా ఉంటా రు. ప్రపంచదేశాలు ఒకదేశ ప్రగతి అనేది ఆ దేశానికున్న సైనిక బలాన్ని బట్టి కూడా అంచనా వేస్తాయి. అందుకే రక్షణశాఖకు కేంద్ర ప్రభుత్వం రాజీలేకుండా బడ్జెట్‌లో ప్రాధాన్యమిస్తుంది.

దీని లో భాగంగా ఈసారి కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖకు 2025- 26 బడ్జెట్‌లో రూ.6,81,210 లక్షల కోట్లు కేటాయించింది.  2024--25 బడ్జెట్‌లో కేటాయింపులు రూ.6.22 లక్షల కోట్లు కాగా, ఈసారి 9.5శాతం పెంచుతూ కేంద్రం బడ్జెట్ కేటాయింపులు చేసింది. వాస్తవానికి ఈసారి రూ.7 లక్షల కోట్లకు పైగా రక్షణశాఖకు కేటాయింపులు ఉంటాయనే అంచనాలు ఉండగా, ఆ మేర కు కేంద్రం నుంచి బడ్జెట్ కేటాయింపులు జరుగలేదు.

పెరిగిన స్వదేశీ డిఫెన్స్ ఉత్పత్తి..

కేంద్రప్రభుత్వం గతేడాది నుంచి ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్’పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. దీనిలో భాగంగా గతేడాది రూ.1.26 లక్ష కోట్ల విలువైన స్వదేశీ డిఫెన్స్  పరికరాలు, సామగ్రిని ఉత్పత్తి చేసింది. అలాగే రూ.21,083 కోట్ల విలువైన డెఫెన్స్ పరికరాలను ఎగుమతి చేసి రక్షణశాఖ ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేస్తున్నది. 

వీటి కొనుగోళ్లకు అడుగులు..

బడ్జెట్ నిధులతో రక్షణశాఖ రూ.63,000 కోట్లతో ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలు, రూ.38,000 కోట్లతో మూడు అదనపు స్కార్పెన్ సబ్‌మెరైన్స్, రూ.53,000 కోట్లతో 156 లైట్ వెయిటెడ్ ‘ప్రచండ్’ హెలికాఫ్టర్లు, రూ.8,500 కోట్లతో 307 అధునాతన టోవ్డ్ ఆర్టిలరీ ఆయుధాలతో పాటు కొన్ని యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను కొనుగోలు చేయనున్నది. 

డీఆర్డీఏకు కేటాయింపులు..

రక్షణశాఖలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఏ) అత్యంత కీలకమైంది. యుద్ధ పరికరాల అభివృద్ధి, పరిశోధనలో డీఆర్డీఏ ముఖ్యభూమిక పోషిస్తుం ది. డీఆర్డీఏకు కేంద్రం గతేడాది బడ్జెట్‌లో రూ.23,924 కోట్లు కేటాయించగా, ఈసారి కాస్త పెంచుతూ రూ.26,817 కోట్లు కేటాయించింది.

మూలధన, రెవెన్యూ వ్యయాలు ఇలా..

కేటాయింపుల్లో మూలధన వ్యయం రూ.1,92,387 కోట్లు కాగా, రక్షణశాఖ వీటిని అడ్వాన్స్‌డ్ జెట్స్, యుద్ధనౌకలు, అధునాతన ఆయుధాలు, లాజిస్టిక్స్ తో పాటు ఆర్మీకి అవసరమైన హార్డ్‌వేర్స్ కొనుగోలు చేస్తుంది. బలమైన సైనిక స్థావరాలు, క్యాంప్స్ ఏర్పాటు చేస్తుంది.

దేశ సరిహద్దు ప్రాంతాల్లో వంతెనలు, రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు రూ.7,146 కోట్లు వెచ్చించనున్నది. 2024 25 మూలధన వ్యయం రూ.1.72 కోట్లు కాగా, రక్షణశాఖ రూ.1.59 కోట్లు ఖర్చుపెట్టింది. అలాగే రెవెన్యూ వ్యయం రూ.4,88,822 కోట్లు కాగా, రక్షణశాఖ వీటిని రోజువారీ నిర్వహణ, ఆర్మీ ఉన్నతాధికారులు, సైనికులు, సిబ్బంది వేతనాలు, పింఛన్లకే వెచ్చిస్తుంది.

కేటాయింపుల్లో రూ.1.60 లక్షల కోట్లు పింఛన్లకే వెళ్తుండడం ఆర్మీ పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి అద్దం పడుతున్నది. అలాగే రక్షణరంగంలో పరిశోధనలకు కేంద్రం రూ.14 వేల కోట్లు కేటాయించింది.

రక్షణశాఖకు 13.5 శాతం కేటాయింపులు

రక్షణశాఖకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6.81 కోట్లు కేటాయించింది. ఇవి బడ్జెట్‌లో 13.4శాతం. కేటాయింపుల్లో మూలధన వ్యయం రూ.1.92 కోట్లతో రక్షణశాఖ ఆర్మీలో అధునాతన సాంకేతికతను సమకూర్చుకుంటుంది. ఆర్మీ సామర్థ్యాలను పెంచుకుంటుంది.

 కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్