- 2033 నాటికి చేరుకునే అవకాశం
- కట్టడికి విధానపరమైన కఠిన చర్యలు అవసరం
- 2023లో సైబర్ దాడుల్లో 15 శాతం పెరుగుదల
- ప్రహార్ సంస్థ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబర్ 30: దేశంలో నానాటికీ సైబర్ నేరాలు పేట్రేగిపోతున్నాయి. వేలాది మంది ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టులతో కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు.
ఈ నేరాలపై నియంత్రణ లేకుండా ఇలాగే కొనసాగితే 2033 నాటికి భారత్‌లో ఏటా ట్రిలియన్ (లక్ష కోట్లు) సైబర్ దాడులు జరిగే అవకాశముందని ప్రహార్ సంస్థ విడుదల చేసిన ది ఇన్‌విజిబుల్ హ్యాండ్ నివేదిక వెల్లడించింది. 2047 నాటికి ఈ సంఖ్య 17 ట్రిలియన్లకు చేరుతుందని తెలిపింది.
దేశంలో వేగంగా డిజిటలైజేషన్ ప్రక్రియ జరగడం వల్లనే ఈ విధంగా సైబర్ దాడులు జరుగుతున్నాయని, వీటిని కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని సూచించింది.
మూడో స్థానంలో భారత్
భారత్‌లో డిజిటలైజేషన్ వేగంగా విస్తరించడం వల్ల సైబర్ దాడులు ఎలా పెరిగాయనే అంశంపై ఈ నివేదిక ప్రధానంగా దృష్టి సారించింది. ఎయిమ్స్, విమానయాన సంస్థలపై జరిగిన సైబర్ దాడులను ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. 2023లో దేశవ్యాప్తంగా 7.9 కోట్ల సైబర్ దాడులు జరిగాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 15 శాతం పెరుగుదల నమోదైంది.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే సైబర్ దాడుల సంఖ్యలో భారత్ 3వ స్థానంలో ఉంది. 2024లోనూ ఆన్‌లైన్ మోసాల్లో పెరుగుదల కొనసాగుతూనే వస్తోంది. ఈ ఏడాది జనవరి మధ్య 50 కోట్ల సైబర్ నేరాలు జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీటి వల్ల రూ.1,750 కోట్ల నష్టపోగా, 7.4 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగానూ 2024 మొదటి త్రైమాసికంలో సైబర్ దాడుల్లో 76 శాతం పెరుగుదల నమోదైంది.
బెట్టింగ్, గేమింగ్ యాప్‌లతో జాగ్రత్త
కీలకమైన సమాచారాన్ని ఎలా హ్యాక్ చేస్తున్నారు? వాటిని ఎలా తారుమారు చేస్తున్నారు? అంశాలను నివేదిక వివరించింది. దీన్ని ఎదుర్కోవాలంటే పూర్తి ప్రణాళికతో పంచవర్ష జాతీయ సైబర్ సెక్యూరిటీ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరముందని నొక్కి చెప్పింది. ఐటీ సంబంధిత అంశాలను ఒకే సంస్థ లేదా మంత్రిత్వ శాఖ ద్వారా ఏకీకృతం చేయాలని సూచించింది.
గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపైనా దృష్టి సారించాలని తెలిపింది. సైబర్ దాడుల్లోనూ రెండు రకాలు ఉన్నాయని, ఒకటి ఆర్థికంగా దెబ్బతీసేందుకు చేస్తే మరో విధానంలో వ్యక్తిగత లాభం లేదా దేశ భద్రతపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. ఇవి ఎక్కువగా ఈ యాప్‌ల ద్వారానే జరుగుతున్నాయని చెప్పింది.