calender_icon.png 27 November, 2024 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష కోట్ల కట్టడం కూలింది!

27-09-2024 02:14:41 AM

  1. కాళేశ్వరం అవినీతిపై చర్యలు ప్రారంభిస్తే డిపార్ట్‌మెంటే ఉండదు 
  2. చర్యలు తీసుకోకుంటే మేం ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది

కొత్త ఇంజినీర్ల మోడల్ స్టడీకి కాళేశ్వరమే పెద్ద ఉదాహరణ 

జలసౌధలో ఏఈఈలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు చేస్తే, దానిని కట్టడం అది కూలడం రెండూ జరిగిపోయాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితికి ఎవరిని బాధ్యులను చేయాలో మీరే చెప్పాలని కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న ఇంజినీర్లను ఆయన అడిగారు. అధికారులనా.. రాజకీయ నాయకులనా అని ప్రశ్నించారు. కొత్త ఇంజినీర్ల మోడల్ స్టడీకి కాళేశ్వరమే సరైన ఉదాహరణగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

జలసౌధలో ఏర్పాటు చేసిన ఏఈఈలకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని ఏఈఈలను రేవంత్ రెడ్డి కోరారు. గతంలో ఇంజినీర్లు ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారని, ఫీల్డ్ విజిట్ చేశాకే రిపోర్టులు రాసేవారని.. కానీ ఈ మధ్య క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లే వారు తగ్గిపోయారని సీఎం అన్నారు. తాము అధికా రంలోకి వచ్చాక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని ఆదేశించామన్నారు. 

కాళేశ్వరం అవినీతిపై చర్యలు ప్రారంభిస్తే డిపార్ట్‌మెంటే ఉండదు

కాళేశ్వరం విషయంలో అందరిపై చర్యలు తీసుకుంటే డిపార్ట్‌మెంటే ఉండదని సీఎం అన్నారు. ఈఈ చెప్పారని ఒకరు, ఎస్‌ఈ చెప్పారని ఇంకొకరు.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని అన్నారు. రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలను అమలు చేయకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కాదని పేర్కొన్నారు. గత పాలకులు లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని అన్నారు. పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికాకపోవడానికి కారణం ఏమిటో గమనించాలని కోరారు.

2 లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కావొద్దని అన్నా రు. రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు అత్యంత కీలకమని, ప్రాజెక్టుల పూర్తికి క్షేత్ర స్థాయిలో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. రెకమెండేష న్‌తో వచ్చేవారికి అటవీ ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చి పనిష్‌మెంట్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. పని మీద శ్రద్ధ పెట్టాలని.. పోస్టింగుల మీదకాదని అన్నారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సీఎం కోరారు.

ఇది ఉద్యోగం కాదు.. భావోద్వేగం

నీళ్లు, నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ ఏర్పడిందని సీఎం అన్నారు. నీళ్లు మన సంస్కృతిలో భాగమని.. అలాంటి శాఖకు మీరు ప్రతినిధులుగా నియామకమవుతున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన దశాబ్దం తర్వాత నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. ఇది మీకు ఉద్యోగం కాదు.. ఇది మీకు ఒక భావోద్వేగం.. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉందని, దానికి అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజల కు అందించాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు.

ఏ వృత్తిలోనైనా క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నవాళ్లే రాణిస్తారని, రాజకీయాల్లోనూ క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన వారే ఎక్కువ రాణిస్తారని అన్నారు. పీవీ నరసింహారావు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి లాంటి వారు సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానులుగా ఎదిగారని తెలిపారు. తాను కూడా జెడ్పీటీసీ సభ్యుని స్థాయినుంచే సీఎం స్థాయికి వచ్చినట్లు తెలిపారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.