16-04-2025 02:07:07 AM
హైదరాబాద్, ఏప్రిల్ 15 ( విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బ మృతుల కుటుంబాలకు అందించే పరిహారాన్ని రూ.4 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండలు మండుతున్న నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది.
హీట్‌వేవ్ సమస్యపై యాక్షన్ ప్లాన్ అమలు చేయాలంటూ అధికారులను అప్రమత్తం చేసింది. తీవ్రమైన ఎండలు, వడగాలులు, వడదెబ్బ వంటి కారణాలతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో భాగంగా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
గతంలో వడదెబ్బ కారణంగా ఎవరైనా మరణిస్తే రూ.50 వేలు చెల్లించగా, దాన్ని ప్రస్తుతం రూ.4 లక్షలకు పెంచింది. బాధితులకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి వీలుగా రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.