calender_icon.png 27 October, 2024 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఏటా కొత్త ఆయకట్టు 6 లక్షల ఎకరాలు

12-08-2024 01:09:10 AM

ఐదేండ్లలో ౩౦ లక్షల ఎకరాలు సాగులోకి తెస్తాం 

15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభం

అదేరోజు రైతులకు 2 లక్షల రుణమాఫీ

నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్

విజయవంతమైన సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్‌ల ట్రయల్ రన్

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా ఏటా 6 నుంచి 6.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నదని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపా రు. వచ్చే 5 సంవత్సరాల్లో 30 నుంచి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

ఆదివారం అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలోని ముల కలపల్లి మండలం పూసుగూడెం, కమలాపురంలో సీతారామ ప్రాజెక్టు 2,3 పంపుహౌజ్‌లను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన ట్రయల్ రన్ నిర్వ హించారు. అంతకు ముందు గోదావరి జలాలకు పూజలు నిర్వహించి మోటర్లను ఆన్ చేయడంతో గోదావరి జలాలు ఉప్పొంగాయి. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ.. ఈ నెల 15 స్వాతంత్య్ర దినోత్స వం రోజున సీతారామ ఎత్తిపోతల పథ కం పంపుహౌజ్ 2,3లను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభిస్తారని తెలిపారు.

అదే రోజు రాష్ట్ర రైతాం గానికి ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీని వైరా వేదికగా ప్రారంభిస్తారని వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరబోతున్నదని అన్నారు. వృధాగా పోతున్న గోదావరి నీటిని బీడు భూములకు అందించాలన్న నాటి సీఎం రాజశేఖర్‌రెడ్డి కల మరికొన్ని రోజుల్లో నెరవేరుతుందని చెప్పారు. ఎంత ఖర్చయినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సాగునీరు అందించి తీరుతామని తెలిపారు.

గత పాలకులు పదేండ్లు లక్షల కోట్లు వెచ్చించి  చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా నామమాత్రపు ఆయకట్టుకు నీరందిస్తే.. తమ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో సాధ్యమైనంత ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించే దిశగా ముందుకు సాగుతున్నదని వివరించారు. భూ సేకరణకు నిధుల కొరత లేదని తెలిపారు. 2026 నాటికి ప్రాజెక్టులో డిజైన్ చేసిన ప్రకారం 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామని స్పష్టం చేశారు.

భూసేకరణకు నిధులు కావాలి

సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వ 104.40 కిలోమీటర్ల వరకు 1 నుంచి 8 ప్యాకేజీల్లో పనులు పూర్తి అయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. ప్రధాన కాల్వ 9.85 కిలోమీటర్ల నుంచి మారెళ్లపాడు, ఎత్తిపోతల ద్వారా పినపాక నియోజకవర్గంలో 15,795 ఎకరాల ఆయకట్టు సాగునీరు అందుతుందని చెప్పారు. కాల్వల నిర్మాణం కోసం 25 ఎకరాల భూ సేకరణ కలుపుకొని రూ.115.71 కోట్లు అవసరమని వెల్లడించారు. ప్రధాన కాల్వ 74 కిలో మీటర్లవరకు ఆయకట్టు ప్యాకేజ్  కింది 38 వేల ఎకరాలకు సాగునీటి కోసం రూ.663.49 కోట్లతో పనులు చేపడుతున్నామని వివరించారు.

కాల్వ నిర్మాణం కోసం రూ.1,658 ఎకరాల భూసేకరణ అవసరమని చెప్పారు. ప్రధాన కాల్వ 74 నుంచి 98 కిలోమీటర్ల మధ్యన ఆయకట్టు  ప్యాకేజీ  పరధిలో ఉందని పేర్కొన్నారు. ఈ కాల్వ నిర్మాణం ద్వారా 34 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అందుకోసం 1,363 ఎకరాల భూమి సేకరించాలని, అందుకు రూ.387.37 కోట్లు కేటాయించాలని నీటిపారుదలశాఖ మంత్రిని కోరారు. ప్రధాన కాల్వ 102.225 కిలోమీటర్ల నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టు, లంకసాగర్, నాగార్జున సాగర్ కాల్వ ఆయకట్టుకు మొత్తం 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా చేయవచ్చని వివరించారు. అందుకు సరిపడా నిధులు మంజూరు చేయాలని విన్నవించారు.  

ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా రూ.౨,౪౦౦ కోట్లతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రంలో రీ డిజైన్ పేరుతో పేరు మార్చి అంచనా వ్యయం రూ.18 వేల కోట్ల్లకు పెంచి తలాతోకా లేకుండా నిర్మించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. సుమారు రూ.8 వేల కోట్లు గత ప్రభుత్వం నిరుపయోగంగా ఖర్చు పెట్టిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక రైతాంగానికి ఉపయోగపడేలా పనులు పూర్తిచేస్తున్నామని తెలిపారు.

అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు, ఖమ్మం నియోజకవర్గంలోని ఒక మండలం, భద్రాచలం అవతలి వైపు, కొరివి ప్రాంతం తప్ప ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సాగునీరు అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు,  నీటిపారుదశాఖ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, నీటిపారుదలశాఖ కార్యదర్శి ప్రశాంత్, జిల్లా కలెక్టర్ జితేష్ వివ పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్‌కుమార్, చీఫ్ ఇంజినీర్ విజయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.