వరుస కమర్షియల్ సినిమాలతో పలుకరిస్తున్నాడు విశ్వక్‌సేన్. వచ్చిన ప్రతిసారి మినిమం గ్యారెంటీ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. మధ్యమధ్యలో ప్రయోగాలూ చేస్తున్నాడు. అందులో భాగంగానే మరో సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యాడీ యువ కథానాయకుడు. ఈ సారి ‘లైలా’ అంటూ రాబోతున్నాడు. ఇందులో ఆయన విభిన్న పాత్రల్లో నటిస్తుండగా రామ్‌నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై రూపొందుతోందీ సినిమా. ఇందులో విశ్వక్ లేడీ గెటప్‌లో తెరపై సందడి చేయనుండగా, ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం టీజర్, సాంగ్స్ విడుదల కాగా గురువారం ట్రైలర్‌ను సైతం రిలీజ్ చేశారు మేకర్స్. విశ్వక్.. సోను మోడల్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ‘నీ ఛాతీ చూశాక నా ఛాతీ చపాతీ అయింది..’, నాది లోపల ఉన్న మ్యాటర్ తెలిస్తే నీకీ గుండె ఆగి చస్తయ్..’, ‘కాయ లేదు పండు ఉన్నయ్.
పువ్వు లేదు కాయ ఉన్నయ్. చమిడీ లేదు లమిడీ ఉన్నయ్ అంటున్నడు..’ అన్న డబుల్ మీనింగ్ డైలాగులతో ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. ‘ఆడ వేషం వేసిన విశ్వక్‌సేన్‌లా ఉన్నావ్..’ అనే డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. సోనూ వల్ల ఓ సమస్య ఏర్పడటంతో పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తారని, వాళ్లకు దొరక్కుండా లేడీ గెటప్ వేసుకొని ‘లైలా’ పేరుతో తిరుగుతాడని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అయితే లేడీ గెటప్ వేసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు, అసలు సోనూ ఏ సమస్యలో ఇరుక్కున్నాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే అన్నట్టుగా ట్రైలర్‌ను కట్ చేసినట్టు అర్థమవుతోంది. ఈ సినిమాలో విశ్వక్ ఓ పక్క లేడీ గెటప్‌తో అలరిస్తూనే మరో పక్క హీరోయిన్‌తో లిప్ కిస్‌లు, రొమాన్స్‌తో హడావిడి చేయనున్న సంగతినీ ట్రైలర్ ద్వారా చెప్పేశారు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.