ఉట్నూరుకు పది కిలోమీటర్ల దూరంలో అడవి మధ్యలో రాజుల మడుగు అనే చిన్న గ్రామముందట. ఆ గ్రామాన్ని రెండుగా విభజిస్తూ ఒక సెలయేరు. ఏటికి ఇటువైపున కొలాములు (గోండుల వంటి ఆదివాసులు). ఆ దరిని గోండులు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నా రట. ఈ గుడిసెల సమూహాన్ని వారు గ్రామమని వర్ణించినా, మన లెక్కల ప్రకారం అది గ్రామం కాదట. ఐ.టి.డి.ఎ.లో కొలాముల వ్యవహారాలు చూసే డాక్టరు వామనరావు గారు తప్ప ఈ ప్రాం తానికి ఏ అధికారీ వెళ్ళలేదు.
ఏయే ఆదివాస గ్రామాలకు ఇంతవరకు ఏ సాయమూ అందలేదో తెలుసుకుని ఆ గ్రామాలకు ముందు సహాయం అందించాలని తలపెట్టినప్పు డు నాతో పనిచేస్తున్న రాజనరసయ్య గారిచ్చిన సమాచారమిది.
లేడికి లేచిందే పరుగన్నట్టు వెంటనే బయల్దేర మన్నాను. ఉండటానికైతే ఉట్నూరు నుంచీ పది కిలోమీటర్లు దూరమే కానీ జీపు గంటకుపైగా తీసు కుంది ఈ ఊరెళ్లడానికి..
అసలు దారంటూ ఏదీ లేదు. చెట్లమధ్య జీపు పట్టే స్థలముంటే అలా వెళ్లడమే. ఫలానా దిశగా ఇంతకాలం ప్రయాణం చేస్తే ఫలానా గ్రామం చేర తామనేదే లెక్క.
అలా వెడుతుండగా “ఆపండి, ఇదే రాజుల మడుగు” అన్నారు రాజనరసయ్యగారు. నాకే ఊరూ కనబడలేదు. మహా వృక్షాలూ, వృక్షాల నుండి వేలాడుతున్న తీగలూ తప్ప జనసంచారం శూన్యం.
పరిశీలనగా చూస్తే చెట్లమధ్య కొంత ఖాళీస్థలం. ఆ స్థలంలో కొన్ని పూరిళ్లు కనబడ్డాయి. జీపు అక్క డే ఆపి ఆ ఇళ్లకేసి వెళ్లాం.
ఒకరిద్దరు కొలాము వృద్ధులూ, స్త్రీలు తప్ప మరెవ్వరూ లేరు. అమ్మడానికి జిగురూ, తినడానికి దుంపలూ, దొరికితే ఒకటీ ఆరా కుందేళ్ళూ తీసుకు రావడానికి అడవికి వెళ్ళిపోయారట కొలాములం దరూ.
“రామ్ రామ్” చెప్పి కూచుని వాళ్లని కబుర్లలో కి దింపాను. ఐ.టి.డి.ఎ.లో కొలాముల వ్యవహారా లు చూసే డాక్టర్ వామనరావు గారు తప్ప ఎవరూ అక్కడికి అప్పటికి వెళ్లలేదట. (మా సంభాషణ ఉర్దూలో జరిగింది.)
డాక్టర్ వామనరావుగారు సహృదయుడు. ఆదివాసుల యడ అపారమైన అభిమానం గలవా డు. గోండీ భాష అనర్గళంగా మాట్లాడగలడు. వ్యక్తిగత సమస్యలు బోలెడున్నా వాటి ప్రభావం తనమీద పడనివ్వని స్థితప్రజ్ఞుడు.
ఆయన ఈ గ్రామానికి చాలాసార్లు వచ్చి వారి బాగోగులు తెలుసుకున్నాడంటే నేనేమీ ఆశ్చర్యపడ లేదు.
ఆలా కబుర్లలో ఉండగా అడవిలోకి వెళ్ళిన కొలాము యువకులందరూ వచ్చేశారు. నేను ఫలానా వాణ్ణని పరిచయం చేసుకున్నాను. వాళ్లకి నాకు చేతనైనంత సాయం చేయడానికి వచ్చానని వివరించాను. మీకేం కావాలో నిర్భయంగా అడగ మని ప్రోత్సహించాను.
ముందు నాలుగైదు బళ్లూ ఎడ్లూ కావాలట.
సేకరించిన జిగురు ఆరిన తర్వాత ఉట్నూరు తీసికెళ్లి ‘బంకసార్’ (గిరిజన కార్పొరేషన్ షాండీ ఇన్‌స్పెక్టర్)కు ఇవ్వడానికి, అవసరమైన నిత్యావసర వస్తువులు తెచ్చుకోడానికి బళ్లు అవసరమవుతా యట.
జిగురు గిరిజన కార్పొరేషన్ వారికి అమ్మితే ఫర వాలేదు. పనిలో పనిగా కలప అక్రమంగా రవాణా చేస్తేనో? అనుమానం మనసులో దాచుకోకుండా చెప్పేశాను.
ఒక కొలాము వృద్ధుడు నవ్వాడు. “మేము కల ప అమ్మదలచుకుంటే మీరిచ్చే బళ్ళే కావాలా? ఇప్పుడు కలప లారీలలో వెళ్లడం లేదంటారా? మీరేం చేస్తున్నారు? మేము కలప రవాణాలో తోడ్పడతామంటే ఎన్ని లారీలయినా వస్తాయి” అన్నాడు. ఏమనాలో తోచలేదు. మరి బదులు చెప్పక ఏటికద్దరిన ఉన్న గోండుల పూరిళ్లకు వెళ్లాం.
ఏటిలో పట్టిన కొన్ని చేపలు నలుగురూ పంచుకుంటున్నారు మేము వెళ్ళేసరికి. పొయ్యిమీ ద దుంపలు ఉడుకుతున్నాయి. ఉప్పు, పులుసు, కారం లేవు. “బంకసార్ పైసలిచ్చినంక కొంటా” నన్నాడు రాజు అనే గోండు యువకుడు.
కొలాముల నడిగినట్టే “మీ కేం సాయం కావా లని” అడిగా. “ఇళ్లిప్పించండ”న్నాడు రాజు. కప్పు సరిగా లేకపోవడం కారణంగా ఇళ్లన్నీ కురిసి నానా రకాల వ్యాధులు వస్తున్నాయట. ఆ సంవత్సరం అప్పటికే నలుగురు పాపలు పోయారట. చిరుత లు, ఎలుగు బంట్ల బెడద మరీ ఎక్కువగా ఉందట.
‘మా పరిధిలో ఉన్నంత వరకూ సాయం చేస్తా మని’ మాటిచ్చి నేనూ, రాజనరసయ్య గారు వచ్చేశాం.
ఉట్నూరు వచ్చిన తర్వాత (ఐ.టి.డి.ఎ.లోని) ఇతర సోదర అధికారులతో కూర్చుని చర్చించా ము, ‘ఏ సహాయం వెంటనే అందివ్వగలమో’నని.
తేలిందేమంటే ‘వారు అక్కడున్నంత వరకూ ఏ సాయమూ చేయలే’మట. కవ్వల్ అభయారణ్యం (సాంక్చువరీ) మధ్యలో నివసిస్తున్నారు వాళ్లు, అలా నివసించడం చట్టవిరుద్ధం. ఆ గ్రామం వదలి ఏ ఉట్నూరో వెడితే కొంత సాయం చేయవచ్చు. వారు అక్కడున్నంత వరకూ ఏ సాయం చేసినా, మేమూ చట్టవిరుద్ధమైన పని చేసిన వాళ్లమే అవుతాము. మా నిస్సహాయతకు సిగ్గేసింది. ఏదో చేద్దామని ఆర్భాటంగా వెళ్లి ఏమీ చెయ్యకుండా తోక ముడు చుకు రావడం కన్నా అసహ్యమైన పని వేరే ఉం టుందా? వెంటనే చేయగలిగిందేమీ లేదు కాబట్టి, ఈ తడవ ఆ గ్రామం వెళ్ళినప్పుడు పరిస్థితి వారికి వివరిద్దామనుకున్నాను. ఆ అవకాశం చాలా రోజులకు గానీ రాలేదు.
ఓ రోజు జె.ఎన్.టి.యు. ఫొటోగ్రఫీ శాఖనుండి ఉత్తర మొచ్చింది. ‘డిపార్ట్‌మెంటు తరపున ఫైనలి యర్ విద్యార్థులను ఫొటోగ్రాఫిక్ ఎక్స్‌కర్షన్ తీసుకె ళ్లాలనీ, నాకు అభ్యంతరం లేకపోతే ఆదిలాబాద్ జిల్లాకు వద్దామని ఉందనీ’ రాశారు.
వారొస్తానంటే నాకంతకంటే ఏం కావాలి? వెంటనే ‘రండని’ కబురు చేశాను. పది రోజుల తరువాత వచ్చారు. మూడు రోజులు అవీ, ఇవీ చూసిన తరువాత బయటివారు తరచుగా వెళ్లని గ్రామమేదైనా వుంటే వెళదామనుకున్నారు. వెంటనే రాజులమడుగు గుర్తొచ్చింది. ఆ గ్రామం గురించి వారికి చెప్పాను, అందరూ సంబరప డ్డారు. ఆలస్యమెందుకని ఆ రోజు సాయంకాలమే వెళ్లాం.
హైదరాబాద్ జె.ఎన్.టి.యు. ఫొటోగ్రఫీ శాఖ అధ్యక్షులు ప్రకాశ్ గారు, లెక్చరర్ యశోధరరావు గారు ఆరితేరిన ఫొటోగ్రాఫర్లే కాక మంచి మనసు గల మిత్రులు.
ఫొటోగ్రఫీ కళలో కృషి చేసిన వారూ, ఫొటో గ్రఫీని కళగా ఆరాధించిన వారూ ఫొటోలు తీస్తున్నప్పుడు చూడాలి. నేత్ర పర్వంగా వుంటుంది. తీస్తున్న వారికీ, చూస్తున్న నాకూ సరదాగానే వుంది గానీ అక్కడి కొలాములకు, గోండులకు అర్థం కాలేదు.
“హఠాత్తుగా ఇంతమంది ఇన్ని కెమెరాలతో ఫొటోలెందుకు తీస్తున్నారు? వీళ్ళంతా ఎవరు? మమ్మల్ని వెళ్ళగొట్టడానికి వచ్చారా?” అని అడిగారు.
నివ్వెరపోయానీ ప్రశ్నకు. అయితే, ఇలాంటి ఆలోచన వున్నట్టు వీళ్లకు తెలుసునన్నమాట.
“వీళ్లందరూ మన వాళ్ళే, పట్నం నుంచి వచ్చారు. మీరెలా వుంటారో చూడడానికి.
అయితే, విషయం ఎలాగూ వచ్చింది కనుక అడుగుతున్నాను. ఇక్కడ వుండి మీరు సాధించే దేముంది? లక్షణంగా ఉట్నూరు వెళదాం, రండి. ఈ ఎలుగుబంట్ల బాధా వుండదు. ఇళ్లు కట్టుకో వచ్చు. ఇతర సహాయాలు కూడా అందుతాయి” అన్నాను. అంతేకాదు, ఎందుకైనా మంచిదని “అభ యారణ్యంలో నివసించడం చట్టవిరుద్ధమని” కూడా చెప్పాను.
“అయ్యా! రెండేళ్లనుంచి బంకసారు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఈ మాట వింటున్నాం. తరతరా లుగా ఈ అడవి మధ్యే నివసిస్తున్నాం. ఎలుగుబం ట్లు, చిరుతలు, పాములు ఈ రోజు కొత్తగా వచ్చినవేమీ కాదు. మా భూమినుంచి మమ్మల్ని పెకలించి వేస్తే మేము మాత్రం బతుకుతామా? అభయారణ్యం అభయారణ్యమంటారు. ఇన్నే ళ్ళుగా మేమూ, అడవి, మృగాలూ కలిసే వుంటు న్నాం కదా! ఈ రోజు మృగాల కోసం మమ్ముల్ని వెళ్లగొడతారా?” అన్నారందరూ. ఆ ప్రశ్నలకు జవాబు లేకపోవడం వల్ల కాబోలు నాకు పట్టరాని కోపం వచ్చింది.
“మీరు పరమ మూర్ఖులు. మీకెవరైనా సాయం చేయాలని చిత్తశుద్ధితో ప్రయత్నించినా మీరు పడనివ్వరు. మీలాంటి వారు బాగుపడడం కల్ల” అన్నాను.
ఏటికివతల చోద్యం చూడడానికి వచ్చిన రాజు కూడా కొలాములతో శ్రుతి కలిపాడు.
“మీరు సాయం చేయడానికి వచ్చానని పదేపదే చెబుతున్నారు. మీ సాయం రానంత వరకూ మమ్మల్నెవరూ తరిమివేసే ఆలోచన చెయ్యలేదు. మీరు ఆ పుణ్యం కూడా కట్టుకుంటున్నారు” అన్నాడు రాజు.
నా ఉద్దేశం వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్లను వెళ్లగొట్టడం కానే కాదు. త్రికరణ శుద్ధిగా వాళ్లకి మంచి చెయ్యాలనే వెళ్లాను. కానీ, ఇప్పుడు వాళ్ళు నన్ను నమ్మని పరిస్థితి ఏర్పడుతోంది.
చీకటి పడుతుండగా వారి దగ్గర సెలవు తీసుకు న్నాం. దారిలో ప్రకాష్ గారు చాలా ప్రశ్నలడిగారు. ఇందాకటి సంభాషణ కారణంగా మనసు బాగుం డక పోవడంతో సమాధానాలు ముక్తసరిగా చెప్పా ను. ఒకరోజు రాజనరసయ్యగారు ‘రాజు చెట్టు మీద నుంచి పడి చెయ్యి విరగ్గొట్టుకున్నాడనీ, దుంపలు కూడా సరిగా దొరకడం లేదనీ, ఆది వాసులందరూ పస్తులుంటున్నారనీ’ చెప్పారు.
ఒక బస్తా జొన్నలు, కాస్త చింతపండు, వుప్పు, కారం తీసుకొని రాజుల మడుగు వెళ్లాను. జొన్న లు పంచి పెట్టిన వెంటనే వంట ప్రారంభించేశారు. ఎన్ని రోజులయిందో భోంచేసి వారితో కబుర్లాడు తూ, నేను కూడా అక్కడే భోజనం చేశాను. ఈసారి వారికి అప్రియమైన వూసులేవీ ఎత్తలేదు.
తరువాత కొన్ని వారాలకు ఆదిలాబాద్ నుంచి బదిలీ అయింది. వెళ్ళే ముందు వారినెవరినీ కలవలేకపోయాను. రాజులమడుగు పరిస్థితి ఎప్పు డు గుర్తొచ్చినా బాధగానే ఉండేది.
ఏణ్ణర్థం తరువాత ఏటూరు నాగారం ఐ.టి.డి. ఏ.లో పని చేస్తుండగా వేరే సందర్భంలో ఉట్నూరు వెళ్లాను. ఉన్న రెండు రోజుల్లో నాకు చిరపరిచి తాలైన గ్రామాలు కొన్ని చూశాను. రాజుల మడుగు కూడా వెళదామని బయల్దేరాను.
‘అక్కడేం చూస్తారని’ అడిగారు ఐ.టి.డి.ఏ.లో పనిచేస్తున్న మిత్రుడొకరు. “అక్కడ ఏం చూస్తారని అడుగుతారేమిటండీ? నాకు చాలామంది మిత్రులున్నారు ఆ గ్రామంలో” అన్నాను.
“మీ మిత్రులెవరోగానీ అక్కడ లోగడ గుడిసెలు వేసుకున్న గోండులూ, కొలాములైతే లేరు. ఆ ప్రాంతం వదలి వెళ్లిపోయారు” అన్నారాయన.
వాళ్లంతట వాళ్ళే వెళ్ళిపోయారా?
నేను చేయాలని వెళ్ళిన సాయం ఫలితం కాదు కదా ఇది? కారణం ఏదైతేనేం రాజులమడుగు నుండి రాజులు వెళ్ళిపోయారు. మడుగు మిగిలింది.
(‘గోదావరి కథలు’ నుంచి..)