- రెండు రాష్ట్రాల్లో ప్రభావం చూపించని కాంగ్రెస్
- జార్ఖండ్‌లో అధికారం దక్కినా సీట్లు తక్కువే
- మహారాష్ట్రలోనూ చతికిల పడ్డ చేయిపార్టీ
- లోక్‌సభ సీట్లతోనే ఊరట
న్యూఢిల్లీ: ఈ రోజు ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడిపోయింది. జార్ఖండ్‌లో ఇండియా కూటమి విజయం సాధించినా కానీ అందులో కాంగ్రెస్ గెలిచిన సీట్లు కేవలం 16 మాత్రమే.. ఇక మహారాష్ట్రలో అయితే మరీ ఘోరంగా శివసేన (ఉద్ధవ్ వర్గం) కంటే తక్కువ సీట్లతో సరిపెట్టుకుంది.
కాంగ్రెస్‌కు ఊరట కలిగించే విషయం ఏదైనా ఉందా అంటే అది రెండు పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు మాత్రమే. ఇటీవల ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్ చతికిలపడుతూ వస్తోంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ 101 సీట్లలో పోటీ చేసింది. కానీ ఆపార్టీకి వచ్చినవి మాత్రం 16 సీట్లే కావడం గమనార్హం. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే 30 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా కేవలం 16 సీట్లలోనే విజయం సాధించి చతికిలపడిపోయింది.
వేణుగోపాల్ పరిస్థితేంటి?
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వేణుగోపాల్ భవితవ్యం ఎలా ఉండనుందా? అని అంతా చర్చించుకుంటున్నారు. పార్టీ వరుస పరాజయాల నేపథ్యంలో కాంగ్రెస్ వేణుగోపాల్‌ను పదవి నుంచి తొలగిస్తుందనే చర్చ ఊపందుకుంది. లోక్ సభ ఎన్నికల నుంచి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల వరకు పార్టీ పరిస్థితి రోజురోజుకీ మరింత దిగజారుతోంది. మరి ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ ఎలా వ్యవహరించనుందోనని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు.