calender_icon.png 14 November, 2024 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లగచర్ల దాడి ఘటన వదిలేదే లేదు!

13-11-2024 02:00:12 AM

  1. పక్కా ప్లాన్‌తోనే కలెక్టర్, అధికారులపై దాడి 
  2. పది రోజుల ముందే వ్యూహం
  3. గుండాయిజాన్ని సహించేది లేదు
  4. దాడి వెనుక ఎవరున్నారో బయటపెడుతాం 
  5. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా బీఆర్‌ఎస్ కుట్ర
  6. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడి

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): పక్కా ప్లాన్ ప్రకారమే వికారాబాద్ కలెక్టర్, రెవెన్యూ అధికారులపై దాడులు చేశారని, ఈ దాడి వెనుక ఉన్న ఎవరినీ వదిలిపెట్టమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. రౌడీయిజం, గుండాయిజంతో ప్రభుత్వ అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడులు చేయాలని పది రోజుల ముందు నుంచే ఎవరు ప్లాన్ చేశారో బయటపెడుతామని పేర్కొన్నారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే బాలూనాయక్‌తో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. వికారాబాద్ కలెక్టర్‌పై జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగ ణిస్తోందని చెప్పారు.

కలెక్టర్ చొరవ తీసుకుని ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లారని, పథకం ప్రకారం కొంద రు.. అమాయక రైతులను రెచ్చగొట్టి దాడి చేయించారని పేర్కొన్నారు. కలెక్టర్‌ను ప్రజల దగ్గరికి కాకుండా వేరే స్థలం వద్దకు తీసుకెళ్లింది ఎవరు? ఈ దమనకాండకు పాల్పడిన కుట్రదారులెవరో విచారణ చేస్తున్నట్టు చెప్పారు. పరిశ్రమలు కావాలని అక్కడి రైతులు కోరుకోవడంతోనే.. అధికారులు అక్కడికి వెళ్లారని        

స్పష్టంచేశారు. ప్రభుత్వం ప్రజాస్వామిక స్ఫూర్తితో పరిశ్రమల ఏర్పాటుకు ముందడుగు వేస్తుంటే, అధికారం పోయిందన్న ఆక్రోశంతో బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వేసే ప్రతి అడుగులో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమలు ఏర్పాటు చేద్దామంటే వాటిని బీఆర్‌ఎస్ నాయకులు అడ్డు కుంటున్నారని విమర్శించారు.

ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఎక్కడికైనా వెళ్లి ప్రజాభిప్రాయసేకరణ చేయవచ్చని, తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ అడ్డుకోలేదని చెప్పారు. ఉన్నతాధికారులపై దాడి వెనక ఎవరున్నారో, రాష్ట్రం అభివృద్ధి కాకుండా చేయాలని ఎవరు చేస్తున్నారో బయటపెడుతామని స్పష్టంచేశారు.

దాడి ఘటనలో ఇంటిలి జెన్స్, పోలీసు విషయంలో ఏమైనా తప్పులు జరిగితే చర్యలు తప్పవని అన్నారు. ఏ అంశమైనా రాజకీయం చేయాలనే ఆలోచన తమకు లేదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగొద్దని సీఎం చెప్పారని, మరోసారి రాష్ట్రం లో ఎక్కడై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. 

ఇబ్బందులు తప్పించుకునేందుకే ఢిల్లీకి కేటీఆర్

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో తమకేమి తెలుసని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి శ్రీధర్‌బాబు బదులిచ్చారు. వారికున్న రాజకీయ ఇబ్బందులను అధిగమించడానికి ఢిల్లీకి వెళ్లినట్టున్నారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం మీద బట్టకాల్చి వేయా లని చూస్తున్నారని ఆరోపించారు.

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు.. ఆ పార్టీకి ఏటీఎంగా మారాయా? అని నిలదీశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీకి ఇక్కడి నుంచి డబ్బులు పంపించారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి తమకు వారసత్వంగా ఇచ్చారని పేర్కొన్నారు.

జార్ఖండ్ , మహారాష్ట్రలో కాంగ్రె స్ పార్టీనే గెలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఏదై నా అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొద్దున బీఆర్‌ఎస్ మాట్లాడితే.. సాయంత్రం అదే అంశం పై బీజేపీ స్పందిస్తుందని, ఆ రెండు పార్టీలు ఒక్కటై కాంగ్రెస్ పార్టీ దాడి చేస్తున్నాయన్నారు. 

పరిశ్రమలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు 

కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఏర్పాటు చేసే పరిశ్రమల వల్ల 10 వేల మందికి ఉపాధి కలుగుతుందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో అక్కడి ప్రజలకు ఎలాంటి బాధలేదని.. కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు మాత్రం బాధ ఉందని  అన్నారు. రైతు రుణమాఫీ, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత కరెంట్ లాంటి పథకాలు అమలు చేయడం తప్పా? అని అడిగారు.

ఉద్యోగాల భర్తీ విషయంలోనూ న్యాయపరమైన చిక్కులను తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి సారి జరుగుతున్న గ్రూప్ పరీక్షలను అడ్డుకోవాని చూశారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ మంచి ప్రతిపక్ష పాత్ర పోషించిందని స్పష్టంచేశారు. తమ ప్రభుత్వం నెలకు 5 వేల ఉద్యోగాల చొప్పున ఇప్పటివరకు 50 వేల ఉద్యోగాలిచ్చినట్టు వివరించారు.  

శ్రీధర్‌బాబును కలిసి ఐజీ, వికారాబాద్ ఎస్పీ 

వికరాబాద్ జిల్లా లగచర్లలో వికారాబాద్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వివరాలను మంత్రి శ్రీధర్‌బాబుకు ఐజీ సత్యనారాయణ, జిల్లా ఎస్పీతోపాటు ఉన్నతాధికారులు వివరించారు. ఉన్న తాధికారులపై దాడులు చేయాలని ముందే ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోందని పేర్కొన్నారు. కొందరు నాయకులు ప్రేరేపించడం వల్లే ఘటన జరిగిందనే విషయాన్ని వివరించినట్టు తెలిసింది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, ఎవరున్నా వదిలిపెట్టొద్దని మంత్రి ఆదేశించి నట్టు సమాచారం. 

బీఆర్‌ఎస్ నేత సురేశ్ అరెస్ట్?

  1. లగచర్లలో టెన్షన్!.. భౌతికదాడులపై రాష్ట్రప్రభుత్వం సీరియస్
  2. పోలీసుల అదుపులో 52 మంది.. మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ప్రమేయం ఉందా?

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో సోమవారం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో పాటు ఇతర అధికారులపై జరిగిన భౌతికదాడులపై రాష్ట్రప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సర్కార్ ఆదేశాల మేరకు మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ రాత్రికి రాత్రే 250 మంది పోలీస్ బలగాలను గ్రామంలో మోహరింపజేశారు.

ప్రధాన నిందితుడిగా బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి సన్నిహితుడు బోగమోని సురేష్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. దాడులకు ముందు సురేశ్ 42 సార్లు నరేందర్‌రెడ్డితో మాట్లాడినట్లు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఆరుసార్లు ఫోన్లో సంభాషించినట్లు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది.

అలాగే వీడియోల ఆధారంగా దాడుల తో ప్రమేయం ఉందని భావించిన 52 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించి, వారిలో 36 మందికి దాడులతో ప్రమేయం లేదని నిర్ధారించుకుని వదిలేసినట్లు తెలిసింది. పోలీసుల పహారా కారణంగా గ్రామస్తులు ఇండ్లకే పరిమితమయ్యారు.