calender_icon.png 13 December, 2024 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లగచర్ల నిందితుడికి ఛాతినొప్పి

13-12-2024 02:29:17 AM

  1. సంగారెడ్డి జైలు నుంచి బేడీలతోనే దవాఖానకు తరలింపు
  2. పోలీసుల తీరుపై గిరిజన సంఘాలు, ప్రతిపక్షాల ఆగ్రహం
  3. హీర్యానాయక్ ఆరోగ్యం బాగుందని ప్రకటించిన వైద్యులు 

సంగారెడ్డి, డిసెంబర్ 12 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో సంగారెడ్డి జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు హీర్యానాయక్‌ను బేడీలతో దవాఖానకు తరలించడం వివాదస్పదంగా మారింది. గురువారం హీర్యానాయక్‌కు ఛాతిలో నొప్పిగా ఉందని జైలు అధికారులకు చెప్పడంతో పరీక్షలు చేసేందుకు సంగారెడ్డి సర్కార్ దవాఖానకు తీసుకవచ్చారు.

మూడు రోజుల క్రితం కూడా చాతీలో నొప్పిగా ఉందని అధికారులకు చెప్పడంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించినట్టు తెలిసింది. బుధవారం రాత్రి మరోసారి ఛాతిలో నొప్పి రావడంతో వైద్య పరీక్షలు కోసం సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకొచ్చారు.

అయితే, హీర్యానాయక్‌కు బేడీలు వేసి వైద్య పరీక్షల కోసం తీసుకరావడంపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తోపాటు గిరిజన సంఘల నాయకులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుకు బేడీలు వేసి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అటు హీర్యానాయక్ ఆరోగ్యంపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఛాతినొప్పి వచ్చిన విషయాన్ని దాచకుండా మంచి వైద్యం అందించేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హీర్యానాయక్ ఆరోగ్యం బాగానే ఉందని సంగారెడ్డి  దవాఖాన  సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ తెలిపారు. బుధవారం రాత్రి తీసిన ఈసీజీ నార్మల్‌గా ఉందని చెప్పారు.

గురువారం ఉదయం 2 డీ ఈకో, ఈసీజీతో పాటు మరిన్ని పరీక్షలు చేశామని తెలిపారు. హీర్యానాయక్ ఆరోగ్యం నార్మల్‌గానే ఉందని స్పష్టంచేశారు. కార్డియా కెవలుషేన్ కోసం గాంధీ హాస్పిటల్‌కు రెఫర్ చేస్తామని తెలిపారు.