calender_icon.png 22 February, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేడీ డాన్ చిక్కింది!

22-02-2025 12:58:44 AM

  1. జోయా ఖాన్‌ను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
  2. రూ.కోటి విలువైన హెరాయిన్ స్వాధీనం
  3. హత్యలు, దోపిడీ, ఆయుధాల అక్రమ రవాణాలో కీలకపాత్ర 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: గ్యాంగ్‌స్టర్ అయిన భర్త జైళ్లో ఊచలు లెక్కపెడుతుంటే.. అతడి నేర సామ్రాజ్యాన్ని దగ్గరుండి చూసుకుంటున్న లేడీ డాన్ జోయా ఖాన్ (33) ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. కొన్నేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఆమెను శుక్రవారం ఢిల్లీలో పక్కా ప్లానింగ్ ప్రకారం అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా జోయా ఖాన్ వద్ద రూ. కోటి విలువైన 270 గ్రాము ల హెరాయిన్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ హషీం బాబా మూడో భార్యే ఈ జోయా ఖాన్. హత్యలు, దోపిడీ, ఆయుధాల అక్రమ రవాణా సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్లిన భర్త హషీం బాబా నేర సామ్రాజ్యాన్ని జోయా ఖాన్ మరింత విస్తరించి లేడీ డాన్‌గా పేరు తెచ్చుకుంది.

2017లో హషీం బాబా, జోయా ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హషీమ్ అరెస్ట్ తర్వాత భర్త కార్యకలాపాలన్నీ జోయా దగ్గరుండి చూసుకుంది. పోలీసులకు తనపై  ఎలాంటి అనుమానం రాకుండా డ్రగ్స్ దందా, అక్రమ ఆయుధాల రవాణా చేయడంలో ఎంతో చాకచక్యం ప్రదర్శించేది. తిహార్ జైలులో ఉన్న తన భర్తను కలిసేందుకు తరచూ వెళ్లే జోయా అక్రమ కార్యక లాపాలు నడిపేందుకు కావాల్సిన చిట్కాలు, కోడ్ భాషను వాడేది.

అయితే అందరు గ్యాంగ్‌స్టర్స్‌లా జోయా ఖాన్ అండర్‌గ్రౌండ్‌కు పరిమితం కాలేదు. ఖరీదైన దుస్తులు ధరించి.. ఖరీదైన కార్లలో తిరుగుతూ.. పార్టీలు, లగ్జరీ లైఫ్‌స్టుల్‌ను అలవాటుగా మార్చుకున్న ఆమె విలాసవంతమైన జీవితానికి ప్రాధాన్యత ఇచ్చేది. అంతేకాదు జోయా ఖాన్‌కు సోషల్ మీడియాలోనూ ఊహించినంత ఫాలోయింగ్ ఉంది.

ఎన్నో ఏళ్లుగా ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ఢిల్లీ పోలీసులు, క్రైం బ్రాంచ్ అధికారులు ఎన్నో ఏళ్లుగా ఆపరేషన్లు నిర్వహించినప్పటికీ జోయా పట్టుబడలేదు. ఈశాన్య ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరాకు జోయా ఖాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో ఆమెపై నిఘా ఉంచిన పోలీసులు.. ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ నుంచి ఢిల్లీకి రూ. కోటి విలువైన హెరాయిన్‌ను తీసుకొస్తుండగా పక్కా ప్లానింగ్‌తో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు జోయా ఖాన్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో జిమ్ ట్రైనర్ నాదిర్ షాను హత్య చేసిన వారికి జోయా ఖాన్ ఆశ్రయం కల్పించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

జోయా కుటుంబానిది నేర సామ్రాజ్యమే..

జోయా ఖాన్ మాత్రమే కాకుండా ఆమె తల్లిదండ్రులది కూడా నేరసామ్రాజ్యమే అని పోలీసులు వెల్లడించారు. జో యా తల్లి సెక్స్ రాకెట్ కేసులో జైలుకు వెళ్లి వచ్చింది. ఆమె తండ్రికి డ్రగ్స్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కుటుంబానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో మంచి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.