11-03-2025 12:00:00 AM
చిత్రసీమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుకలు జైపుర్ వేదికగా రెండు రోజులపాటు ఘనంగా జరిగాయి. శని, ఆదివారాల్లో జరిగిన ఈ ఈవెంట్‌లో మొదట డిజిటల్ (ఓటీటీ) అవార్డులు ప్రకటించగా, రెండో రోజు చలనచిత్ర పురస్కరాల ప్రదానం జరిగింది. ఇందులో ‘లాపతా లేడీస్’కు అవార్డుల పంట పండింది. ఈ సినిమా ఏక మొత్తంగా 10 అవార్డులతో సత్తా చాటడం విశేషం.
ఉత్తమ చిత్రం కేటగిరితోపాటు మరో 9 విభాగాల్లో ఐఫా అవార్డులను ఈ సినిమా గెలుచుకొని, ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా ఐఫా అవార్డుల వేదికపై అమితాబ్ బచ్చన్ ‘షోలే’ చిత్రానికి ప్రత్యేక గౌరవం దక్కింది. వచ్చే ఆగస్టుతో ఈ సినిమా 50 వసంతాలు పూర్తి చేసుకోనుంది. అందుకే ఈ సినిమాను ఐఫా వేడుకలో ప్రత్యేకంగా ప్రదర్శించారు.
ఉత్తమ ఓటీటీ సినిమా ‘అమర్‌సింగ్ చమ్కీలా’
ఓటీటీ ప్లాట్‌ఫాంలో విశేష ప్రేక్షకాదరణ పొందిన సినిమాలు, సిరీస్‌లకూ ఈ వేదికపై అవార్డులు అందించారు. పంజాబీ గాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘అమర్‌సింగ్ చమ్కీలా’ ఉత్తమ చిత్రం అవార్డును సొంతం చేసుకోగా, ఇంతియాజ్ అలీ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు.
‘దో పత్తీ’లోని నటనకు గాను కృతిసనన్ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్నారు. ‘సెక్టార్ 36’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా విక్రాంత్ మాస్సే అవార్డును అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా దీపక్ (సెక్టార్ 36), ఉత్తమ సహాయ నటిగా అనుప్రియా గోయెంకా (బెర్లిన్), ఉత్తమ కథకు కనికా థిల్లాన్ (దో పత్తీ) అవార్డులు అందుకున్నారు.
వెబ్‌సిరీస్‌లకూ అవార్డుల ప్రదానం
ఐఫా వేడుకల్లో వెబ్ సిరీస్‌లకూ గౌరవం దక్కిది. ఈ ఏడాది బెస్ట్ వెబ్‌సిరీస్‌గా ‘పంచాయత్ సీజన్3’ నిలువగా, ఈ సిరీస్‌లోని నటనకుగానూ జితేంద్రకుమార్‌కు ఉత్తమ నటుడు, , ఫైజల్ మాలిక్‌కు ఉత్తమ సహాయ నటుడు అవార్డులు వరించాయి. ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించిన దీపక్‌కుమార్ మిశ్రా ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ఇంకా మరికొన్ని సిరీస్‌లు కూడా వివిధ కేటగిరీల్లో అవార్డులు సొంతం చేసుకున్నాయి.