calender_icon.png 28 December, 2024 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళామణులు

06-12-2024 12:00:00 AM

మనం చేసే పనులు మనకు మాత్రమే కాదు.. ఇతరులకూ ఉపయోగపడాలి. ఎప్పుడైతే మన లక్ష్యాలు సమాజంపై బలమైన ముద్ర వేస్తాయో.. అప్పుడే ఇతరులకు ప్రేరణగా నిలుస్తాం. ఒకరు గ్రామీణ మహిళల హక్కుల కోసం, మరొకరు క్రీడాలోకం కోసం, ఇంకొకరు సామాజిక సేవ.. ఇలా విభిన్న రంగాలపై ముద్ర వేశారు. అందుకే బీబీసీ విడుదల చేసిన స్ఫూర్తివంతమైన 100 మహిళల జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్నారు ఈ ముగ్గురు. వారే అరుణా రాయ్, వినేష్ ఫోగట్, పూజా శర్మ.

అరుణా రాయ్

“మహిళలు వంటింటి కుందేళ్లు. అలాంటివాళ్లు ఉన్నత ఉద్యోగాల్లో రాణించలేరు” అనుకునే రోజుల్లోనే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్ష రాసి ఎంపికైంది అరుణా రాయ్. సబ్‌డివిజనల్ మెజిస్ట్రేట్ నుంచి ‘లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ దిల్లీ’ సెక్రెటరీ వరకు ఎన్నో పదవులు నిర్వహించినప్పటికీ తనలో ఏదో అసంతృప్తి ఉండేది. ప్రతి రంగంలోనూ అవినీతి ఉండటంతో జీర్ణించుకోలేకపోయింది. ఈ అసంతృప్తులు తారస్థాయికి చేరడంతో  ఉద్యోగానికి రాజీనామా చేసింది.

ఆ తర్వాత భర్తతో కలిసి భర్త సంజిత్ రాయ్ నిర్వహిస్తున్న సోషల్ వర్క్ రిసెర్చ్ సెంటర్(బేర్ఫుట్ కాలేజీ)లో చేరింది. ఈ సెంటర్ ద్వారా ఎంతోమంది మహిళలకు కనీస సౌకర్యాలపై అవగాహన కల్పించారు. మనదేశంలో అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా, తాగునీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం లేవు.  కిలోమీటర్ల కొద్దీ దూరం నడవాల్సి వచ్చేది. ఇవన్నీ అరుణా రాయ్‌ను కలిచివేశాయి. మహిళలు ఒక బృందంగా ఏర్పడి గ్రామ అభివృద్ధికి పాటుపడేలా కృషి చేసింది.

అంతేకాదు.. దేశంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి రావడంలో అరుణా రాయ్ పాత్ర కీలకం. సమాచార హక్కును సద్వినియోగం చేసుకోవడం ద్వారా స్త్రీలు సమానత్వం, సాధికారత సాధించగలుగుతారనే లక్ష్యంతో ఎంతోమందిని చైతన్యపర్చింది. 

వినేష్ ఫోగట్

మనదేశంలో ప్రతిభవంతులైన రెజ్లర్‌లలో వినేష్ ఫోగట్ ఒకరు. చాంపియన్‌షిప్‌లు, కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో అనేక పతకాలు గెలుచుకొని భారతదేశ పతాకాన్ని రెపరెపలాడేలా చేసింది. 2024లో ఫోగట్ ఒలింపిక్ ఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా నిలిచింది. అయితే, ఫైనల్లో పాల్గొనేందుకు అర్హత ఉన్న బరువు ప్రమాణాలను అందుకోవడంలో విఫలమవడంతో ఆమె తర్వాత అనర్హత వేటు పడింది. అయినా ఆధైర్యపడలేదు. పడిలేచిన కెరటం రాజకీయాల్లోనూ రాణిస్తోంది.

ఆగస్ట్ 25, 1994న హర్యానాలోని చర్కి దాద్రీలో జన్మించిన వినేష్ ఫోగట్‌ది కుస్తీ పట్టే కుటుంబం. ఆమె తండ్రి, రాజ్పాల్ ఫోగట్, ఆమె కజిన్స్ గీతా, బబితా ఫోగట్ అందరూ నిష్ణాతులైన మల్లయోధులు. వినేష్ ఫోగట్ వారి అడుగుజాడలను అనుసరించారు. భారత్ గర్వించదగ్గ అత్యంత ప్రసిద్ధ మహిళా రెజ్లర్‌లలో ఒకరిగా నిలిచారు. గాయాలతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె పట్టుదలతో పోరాడి తనంతట తానుగా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై చాంపియన్‌గా నిలిచారు. హర్యానాలోని ఒక చిన్న గ్రామం నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న అద్భుత ప్రయాణం ఆమెది. ఒక రెజ్లర్‌గా అనేక వేదికలపై చాలా సార్లు భారత జెండాను రెపరెపలాడించిన ఫోగట్ ఇప్పుడు రాజకీయాల్లోను సత్తా చాటుతోంది.

-పూజా శర్మ

మన కళ్ల ముందు ఎంతోమంది పేదలు చనిపోతుంటారు. కానీ అంత్యక్రియలు పూర్తి చేయడానికి ఎవరు ముందుకురాని సందర్భాలెన్నో. ఇవన్నీ పూజా శర్మను కదిలించాయి. ఈమె ఎన్నో అనాథ శవాలకు అంత్యక్రియలు చేసి పేదలకు అండగా నిలుస్తోంది. 1996 జూలై 7న ఢిల్లీలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. 2022లో వారి కుటుంబంలో అనుకోని ఘటన జరిగింది. అనారోగ్యం బారిన పడి తన తల్లి ప్రాణాలు కోల్పోయారు. కొద్ది రోజుల అనంతరం స్థానికంగా జరిగిన ఓ వివాదంలో కొందరు వ్యక్తులు తన అన్నయ్యను ఆమె కళ్లముందే దారుణంగా హత్య చేశారు.

ఆ షాక్‌ను తట్టుకోలేక ఆమె తండ్రి కోమాలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో తన సోదరుడి అంత్యక్రియలు చేయడానికి ఎంతమందిని అడిగినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమే స్వయంగా తన సోదరుడికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇందుకుగానూ బంధువులు, కులస్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు.  అయినా కూడా బెదరకుండా తన అన్నయ్యలా అకారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న వారికి, అనాథ శవాలకు వారి కుటుంబంలోని ఓ వ్యక్తిగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత మూడేళ్లుగా ఢిల్లీలో వదిలేసిన మృతదేహాలకు పూజా శర్మ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఆమె 4,000 మందికి పైగా అంత్యక్రియలు నిర్వహించింది.