calender_icon.png 28 September, 2024 | 10:58 AM

ఏపీలో లడ్డూ రాజకీయం

26-09-2024 02:41:57 AM

పవన్ ప్రాయశ్చిత్తానికి పోటీగా జగన్ ప్రక్షాళన దీక్ష

ఈనెల 28 నుంచి ఆలయాల్లో వైసీపీ పూజలు

తిరుమలకు కాలినడకన జగన్ యాత్ర

నెయ్యి కల్తీపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు

జగన్ చిత్తశుధ్దిని నిరూపించుకోవాలి

ఆలస్యమైనా దోషులు శిక్ష నుంచి తప్పించుకోలేరు

ఏపీ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్

విజయవాడ, సెప్టెంబర్ 25: తిరుమల లడ్డూ అధికార టీడీపీ చేస్తోన్న ఆరోపణలకు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కౌంటర్ ఇచ్చారు. తిరుమల ప్రసాదమైన లడ్డూను, వెంకటేశ్వరస్వామి విశిష్ఠతను సీఎం చంద్రబాబునాయుడు అపవిత్రం చేశారని ఆరో పించారు.

ఆ పాప ప్రక్షాళన కోసం తాము పూజలు చేస్తామని ఎక్స్ వేదికగా జగన్ ట్వీట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 28న వైసీపీ నేతలంతా చంద్రబాబు చేసిన పాప ప్రక్షాళనకు ఆలయాల్లో పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

తిరుమల లడ్డూల తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వుతో కల్తీ చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. తిరుమలపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి చంద్ర బాబు పాపం చేశారని మండిపడ్డారు. 

నెయ్యి కల్తీపై టీటీడీ ఫిర్యాదు

తిరుమల లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ అంశంపై పోలీసులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఫిర్యాదు చేసింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీ కృష్ణ ఫిర్యాదు చేశారు. నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఆరోపిం చారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. 

చేసిన పాపాలు చాలు: పయ్యావుల

లడ్డూ వివాదంపై ఏపీ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ స్పందిస్తూ.. దేవుడిపై నమ్మకం ఉందని జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్ తీరుపై మండిపడ్డారు. మీకు దేవుడిపై నమ్మకం లేకున్నా విశ్వసించే కోట్లాది మంది భక్తులు ఉన్నారు.

తిరుమల సమస్యను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం బాధాకరం. ప్లీజ్.. మీరు చేసిన పాపాలు చాలు. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు. నెయ్యి కల్తీ జరిగిందనేది నిజం. అపచారం. గతంలో తిన్న లడ్డూకు ప్రస్తుతం లభిస్తున్న లడ్డూకు తేడాను భక్తులను అడిగితే తెలుస్తుంది. అంతకుమించిన మరో పరీక్ష అవసరం లేదు కేశవ్ సూచించారు.

పాలకుడి మార్పుతోనే ప్రతిరంగంలో మార్పులు వచ్చాయని, ధర్మ ప్రచారం, పరిరక్షణలోనూ మార్పు మొదలైందన్నారు. జగన్ ఇకనైనా రాజకీయాలు మానుకోవాలని సూచించారు. అన్య మతస్థులు శ్రీవా రిని దర్శించుకోవాలంటే రిజిస్టర్ సంతకం చేయాల్సి ఉంటుందన్నారు.

ఘోరమైన తప్పులు చేసి కప్పిపుచ్చుకునేందుకు ప్రజలతో పూజలు చేయమంటున్నారని జగన్‌పై ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులందిరినీ చట్టం ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. 

కాలినడకన తిరుమలకు జగన్

తిరుమలలో అపచారం జరిగిందని, దానిని నివారించేందుకు నాలుగు రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎం ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో మెట్లను పవన్ శుభ్రం చేశారు. అయితే, ఇప్పుడు ఆలయాల్లో వైసీపీ దీక్షలు మొదలుకాను న్నాయి.

పవన్ ప్రాయశ్చిత్త దీక్షకు పోటీగా ఈనెల 28 నుంచి పాప ప్రక్షాళన దీక్షను జగన్ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా కాలినడనక తిరుమలకు వెళ్లి జగన్ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నట్లు సమాచారం. లడ్డూ కల్తీ వివాదంలో ప్రభుత్వ ఆరోపణలతో తమ పార్టీకి నష్టం జరిగే అవకాశమున్న నేపథ్యంలో తాము హిందూ వ్యతిరేకులం కాదని చెప్పేందుకు జగన్ ఈ యాత్రను చేపట్టినట్లు తెలుస్తోంది.