తిరుపతి లడ్డూ వ్యవహారం అనేక మలుపులు తిరిగి ఇప్పుడు రాజకీయ వివాదంగా మారింది. కోట్లాది భక్తులు ఎంతో పవిత్రమైనదిగా భావించే తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని, జగన్ నేతృత్వంలోని వైసీసీ ప్రభుత్వం అవినీతి కారణంగానే ఇది జరిగిందంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనతో మొదలైన ఈ వివాదం చివరికి రాజకీయరంగు పులుముకొని సుప్రీంకోర్టు ముంగిటికి చేరింది.
ఈ వ్యవహారంపై దాఖలయిన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి ఆరోపణ పర్వానికి తెరదీసింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు లడ్డూ వివాదం ఎలా రాజకీయాలకు కేంద్రంగా మారిందో అద్దం పడుతున్నది.
గత జగన్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని, చివరికి వెంకన్న లడ్డూను సైతం కల్తీమయం చేసిందంటూ గత నెల 19న చంద్రబాబు మీడియా సమావేశంలో చేసిన సంచలన ఆరోపణతో ఒక్కసారిగా రాష్ట్రంతో పాటుగా దేశంలోని వివిధ హిందుత్వ సంఘాలు, రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి.
లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి లో జంతువుల కొవ్వువంటివి కల్తీ అయ్యాయని గుజరాత్‌కు చెందిన ఎన్‌డీడీబీ ల్యాబ్ జరిపిన పరీక్షలో తేలిందని కూడా బాబు చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. దీనిపై వెంటనే స్పందించిన జగన్ తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరగడం అసాధ్యమని, టీటీడీ బోర్డు ఎన్నో రకాల క్వాలిటీ చెక్‌లు నిర్వహించిన తర్వాతే నెయ్యి ట్యాంకర్లను అనుమతిస్తుందని, నాణ్యత సరిగా లేకపోతే ట్యాంకర్లను వెనక్కి పంపిస్తారని స్పష్టం చేశారు.
గతంలో ఎన్నోసార్లు అలా జరిగిందని కూడా చెప్పారు. అంతేకాదు, ఈ ఏడాది జులైలో నిర్వహించిన ల్యాబ్ టెస్టు ల్లో ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నట్లు ధ్రువీకరణ కావడంతో ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించినట్లు కూడా ఆయన చెప్పారు. తన ప్రభుత్వ వైఫల్యాలనుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి, రాష్ట్రంలో ప్రజల్లో అశాంతిని రెచ్చగొట్టడానికి చంద్రబాబు ఈ ఆరోపణలు చేస్తున్నారని ఎదురుదాడి చేశారు.
అంతేకాదు, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ జగన్ ఓ లేఖ కూడా రాశారు. చంద్రబాబు చేసిన ఆరోపణలు కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఆ లేఖలో జగన్ ఆరోపించారు. జగన్ ప్రధానికి లేఖ రాయడం వెనక తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడంతో పాటుగా తిరుమల పవిత్రత ను కాపాడడంతో తాము ఎక్కడా రాజీ పడలేదని చెప్పడం ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.
అయితే చంద్రబాబు ప్రభుత్వం దీన్ని అంతటితో వదిలి పెట్టలేదు. ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఐజి స్థాయి అధికారితో ‘సిట్’ను ఏర్పాటు చేయడంతో పాటుగా తిరుమల ఆలయంలో శాంతిహోమం, పంచగవ్య శుద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రసాదాల తయారీపైనా తనిఖీలు చేపట్టింది.
మరోవైపు లడ్డూల అపవిత్రత సనాతన ధర్మానికి జరిగిన హానిగా పేర్కొంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేపట్టనున్నట్లు ప్రకటించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. డిక్లరేషన్‌పై సంతకం చేయకుంటే క్రైస్తవుడైన జగన్ తలపెట్టిన తిరుమల యాత్రను అడ్డుకొంటామంటూ బీజేపీతో పాటుగా వివిధ ధార్మిక సంఘాల నేతలు ప్రకటిం చడం, దాంతో ఆయన పర్యటనను రద్దుచేసుకోవడం తెలిసిందే.
టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదం మరింత ముదిరేలా చేశాయి. దీంతో సిట్ విచారణకు మూడు రోజుల పాటు తాత్కాలిక విరామం ఇచ్చారు కూడా. గురువారం సుప్రీంకోర్టు జరపబోయే విచారణతోనైనా దీనికి తెరపడుతుందని కోట్లాది భక్తులు ఆశిస్తున్నారు.