calender_icon.png 25 September, 2024 | 5:51 AM

తారస్థాయికి లడ్డూ వివాదం

25-09-2024 03:16:39 AM

తిరుమల లడ్డూ వివాదం ముదిరి పాకాన పడ్డది! ’తార’స్థాయికి చేరి, దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వివాదంలో నిలబడి సనాతన ధర్మం అంటూ పోరాడుతున్నారు. అయితే ఆయనపై కూడా విమర్శలు వస్తున్నాయి. నటుడు ప్రకాశ్ రాజ్ ముందు నుంచీ బీజేపీకి, హిందువులకు మద్దతుగా మాట్లాడే వారిపై కౌంటర్లు వేస్తూ, వ్యంగ్యంగా విమర్శలు చేస్తారని తెలిసిందే.

ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కూ అలాగే రిప్లై ఇవ్వడంతో పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘హిందువుల గురించి మాట్లాడితే ప్రకాశ్‌రాజ్‌కు సంబంధమేంటి? ఏం పిచ్చి పట్టింది మీకు? హిందువులకు అవమానం జరిగితే మాట్లాడటం తప్పా అంటూ ప్రశ్నిస్తూనే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మళ్లీ ప్రకాశ్ రాజ్ పవన్ వ్యాఖ్యలకు స్పందిస్తూ ఎక్స్‌లో ఓ వీడియో షేర్ చేశారు.

ఆ వీడియోలో మాట్లాడుతూ.. ’శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ చూశాను. నేను చెప్పింది ఏంటి? మీరు దాన్ని అపార్థం చేసుకొని తిప్పుతున్నదేంటి? నేను ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీరు అన్న ప్రతి మాటకు సమాధానం ఇస్తాను. ఈ లోపు మీకు కుదిరితే నా ట్వీట్‌ని మళ్లీ చదవండి, అర్ధం చేసుకోండి ప్లీజ్’ అని అన్నారు.  

హీరో కార్తీ క్షమాపణలు..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తమిళ స్టార్ హీరో కార్తీ క్షమాపణలు చెప్పారు. తిరుమల లడ్డు వివాదంపై తాను తప్పుగా మాట్లాడి ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం క్షమించాలి అంటూ ట్వీట్ చేశారు. ’డియర్ పవన్ కళ్యాణ్ గారు మీరంటే నాకు ఎంతో గౌరవం. నా వ్యాఖ్యలపై అనుకోని అపార్థం ఏర్పడినందుకు క్షమాపణలు చెబుతున్నా. వేంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను ఎప్పుడూ సంప్రదాయాలను గౌరవిస్తాను’ అంటూ కార్తీ రాసుకొచ్చారు. 

తమ్ముడి వ్యాఖ్యలకు సూర్య ప్రాయశ్చిత్త దీక్ష

తమ్ముడు కార్తీ చేసిన వ్యాఖ్యలకు తాను బాధపడుతున్నానని, తాను కూడా మూడు రోజుల పాటు దీక్ష చేస్తానని తమిళ సినీ హీరో సూర్య ప్రకటించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్‌కు ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. తాను తమ్ముడు చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నానని, తాను రేపటి నుంచి మూడు రోజుల పాటు దీక్ష చేస్తున్నానని, పవన్ కళ్యాణ్‌కు సారీ చెప్పారు. తమ్ముడు అలా అని ఉండాల్సింది కాదన్నారు..