26-03-2025 12:23:00 AM
ఎల్బీనగర్, మార్చి 25 : జాతీయ రహదారిలో నిలబడడానికి నీడ లేక ప్రయాణి కులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూర్చోవడానికి, నిలబడడానికి బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. అసలే వేసవి కాలం... మండుతున్న ఎండలు బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి.. అత్యవసర ప్రయాణాలు చేయాలంటే ప్రయాణికులకు నీడ లేదు.
ఆర్టీసీ బస్సుల కోసం ఎండలో ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ప్రయాణికులకు బస్ షెల్టర్లు లేకపోవడంతో ఎండకు మారిపోతున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనులతో పాత బస్ షెల్టర్లు కూల్చివేశారు. ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్ పేట, ఎల్బీనగర్ నుంచి చంపాపేట, ఎల్బీనగర్ నుంచి నాగోల్, సాగర్ రింగ్ రోడ్డు నుంచి బీఎన్ రెడ్డి నగర్, నాగోల్ నుంచి బండ్లగూడ వరకు ఆర్టీసీ స్టాప్ ల్లో బస్ షెల్టర్లు లేవు.
ఇటీవల జాతీయ రహదారి విస్తరణ పనులతో పాత షెల్టర్లు కూల్చివేశారు. విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు పూర్తయినా ఎక్క డా బస్ షెల్టర్లు నిర్మించలేదు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడ జాతీయ రహదారిలో ప్రయాణికులకు సేద తీరడానికి నీడ కరువైంది. ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు రోడ్డు ఇరువైపులా బస్ షెల్టర్లు లేవు.
ఎల్బీనగర్, చింతకుంట, పనామా, సుష్మా టాకీస్, ఆటో నగర్, డీర్ పార్కు , భాగ్యలత, కృష్ణవేణి దవాఖాన, వినాయక నగర్, వర్డ్ అండ్ డీడ్ స్కూల్, లక్ష్మారెడ్డి పాలెం, పెద్ద అంబర్ పేట వరకు రోడ్డు ఇరువైపులా బస్ షెల్టర్లు లేవు. వేసవి కాలం కావడంతో భారీ స్థాయిలో ఎండలు మండుతుండడంతో రో డ్డు పై ఒక్క నిమిషం నిలబడలేని పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు మండుతున్న ఎండలకు నిలువ నీడ లేకపోవడంతో అల్లాడిపోతున్నారు.
రోడ్డు విస్తరణతో ప్రయాణికులు కకావికలం..రోడ్డు విస్తరణ పనులతో ప్రయాణికులు కకావికలం అయ్యారు. ప్రయాణం చేయడానికి అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి. జాతీయ రహదారిపై ఇనుప కంచె నిర్మాణంతో కాలనీల నుంచి రోడ్డుపైకి రావాలన్నా... తిరిగి గమ్యస్థానాలకు చేయాలన్నా.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల దూరంలో యూ టర్న్, యూ టర్న్ దాటి బస్సు ఎక్కి, తిరిగి ఇంటికి వెళ్లాలంటే చెమటలు కక్కాల్సిందే.
ఇనుప కంచె నిర్మాణంతో రోడ్డు దాటలేదు.. అత్యవసర పరిస్థితుల్లో రోడ్డుపై బారికేడ్లను దూరాల్సిందే... ఈ క్రమంలో కొందరు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లకు ఇరు వైపులా బస్ షెల్టర్లు నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు. నిలబడడానికి నీడ లేకపోవడంతో ఎండకు మాడిపోతున్నట్లు పేర్కొంటున్నారు. వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని బస్ షెల్టర్లు నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
బస్ షెల్టర్ల నిర్మాణాలపై సర్వే పూర్తి చేశాం
విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు బస్ షెల్టర్లు నిర్మిస్తాం. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్, ఆర్టీసీ ఉన్నతాధికారులు సర్వే పనులు పూర్తి చేశాం. ఆర్టీసీ బస్ షెల్టర్ల నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆర్టీసీ నుంచి ప్రతిపాదనలు పంపించాం.
ట్రాఫిక్ అధికారులు సైతం భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని కొన్ని సూచనలు చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా.. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రయాణికుల భద్రత లక్ష్యంగా బస్ షెల్టర్లు నిర్మిస్తాం. ఇప్పటికే సర్వే పూర్తి చేశాం... త్వరలోనే బస్ షెల్టర్ల నిర్మాణ పనులను ప్రారంభిస్తాం.
శ్రీనివాస్ రావు, హయత్ నగర్ డిపో 2 మేనేజర్