27-02-2025 01:21:40 AM
సిద్దిపేట ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): ఉన్నతమైన భవిష్యత్తు కోసం విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు ప్రభుత్వ బడికి వెళ్తున్న బాలికలకు భద్రత కరువైంది. సమాజానికి దిక్సూచిగా ఉండాల్సిన ఉపాధ్యాయులు కామ వాంఛలతో వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నారు.
ఉత్తమ విద్యకు విద్యార్థుల భద్రతకు నిలయాలుగా ఉండాల్సిన ప్రభుత్వ పాఠశాలలు బాలికలకు అభద్రత కేంద్రాలుగా మారుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఇటీవల బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు వెలుగు చూశాయి. అనేక సంఘటనలు వెలుగులోకి రాకుండా ఉన్నాయని ఉపాధ్యాయ వర్గాలు ఇచ్చిన సమాచారం.
లోపాలను ఆసరాగా....
విద్యార్థినిల లోపాలను ఆసరాగా చేసుకుని ఉపాధ్యాయులు వారి కామ పిసచత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. గణితం, సామాన్య శాస్త్రం, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టుల్లో విద్యార్థులు అంతంత మాత్రంగానే మార్కులు సాధిస్తారు. ఇదే అదును చూసుకుని ఉపాధ్యాలు రాత్రి సమయాల్లో వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి సరిగా చదవడం లేదని పలానా సబ్జెక్టులో తక్కువ మార్కులు సాధిస్తుందని ఫిర్యాదు చేయడం,
మరి కొందరు ఫోన్ ద్వారా విద్యార్థుల అనుమానాలు నివృత్తి చేస్తామంటూ గంటల తరబడి మాట్లాడుతూ పిల్లలకు ఆసక్తికరమైన విషయాలు చెప్పటం, పాఠశాలలోని కంప్యూటర్, సైన్స్ ల్యాబ్ లోకి తీసుకెళ్ళి ఉపాధ్యాయుల సెల్ ఫోన్ లలో భూతులు చూపించడం, వారితో సన్నిహితంగా మెదలటం, బ్యాడ్ టచ్ చేయటం సాదరంగా మారింది. విద్యార్థినిలు తిరగబడడం, పిర్యాదు చేయటం చేయకుండా ఉండాలంటే మార్కులు అధికంగా వేస్తానని, లేదంటే ల్యాబ్ పరీక్షలో ఫెయిల్ చేస్తానని బెదిరించడం కీచక ఉపాధ్యాయులు పాటించే పద్ధతులు.
సిద్దిపేట జిల్లాలోని రాయపోల్ మండలంలోని ఓ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిల పట్ల తరుచుగా అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయునిపై బాలల సంరక్షణ శాఖ అధికారులు విచారణ జరపగా సదరు ఉపాధ్యాయున్ని డిప్యూటేషన్ పై మరో పాఠశాలకు పంపించారు. కొండపాక మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు బాలికల పట్ల ఆసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.
దాంతో అదే పాఠశాలలోని ఉపాధ్యాయులు, గ్రామస్తులు పలుమార్లు హెచ్చరించి బుద్ధి చెప్పారు. అయినా వక్రబుద్ధి గల ఉపాధ్యాయుడు తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో మరోసారి విద్యార్థినిల పట్ల బ్యాడ్ టచ్ చేయటంతో ఆగ్రహించిన బాలికలు దేహశుద్ధి చేశారు. దాంతో సదరు ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లగా తల్లిదండ్రులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు ఉపాధ్యాయుని పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
తల్లిదండ్రుల పర్యవేక్షణ...
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీ ఉంటుంది. అవి ప్రభుత్వ పాఠశాలల్లో నామ మాత్రంగా పని చేస్తాయి. ఇక ప్రయివేట్ పాఠశాలల్లో అసలు కమిటీలే ఏర్పాటు చేయరు. ప్రతి పాఠశాలలో తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉన్నప్పుడు అందులోని ఉపాధ్యాయుల పనితీరు, ఆలోచన విధానం, ప్రవర్తన తీరు తెలుసుకోగలుగుతారు. పిల్లలు కూడా ధైర్యంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలని తల్లిదండ్రులకు చెప్పగలుగుతారు.
ఉపాధ్యాయులకు తప్పుడు ఆలోచనలు కలిగినప్పుడు అలా ప్రవర్తించేందుకు అవకాశం లేకుండా ఉండాలంటే, తల్లిదండ్రులు ప్రతి నెలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య మొదట్లోనే గుర్తించగలిగితే అనార్ధాలు జరగకుండా ఉంటాయి.
ప్రభుత్వం పిల్లలకి బ్యాడ్ టచ్, గుడ్ టచ్ పై అవగాహన కల్పించాలి. ఈ అవగాహనలో తల్లిదండ్రులను ఉపాధ్యాయులను బాగాస్వాములను చేయాలి. ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరానికి ఒకసారి ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ఇవ్వాలి. దాంతో వారిలో వక్రబుద్ధి ప్రదర్శించకుండా ఉండగలుగుతారు.
భాగ్య, ప్రోగ్రెసివ్ పేరెంట్స్ లీగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. సిద్దిపేట