calender_icon.png 23 October, 2024 | 3:48 AM

సర్కార్‌లో సమన్వయ లోపం

23-10-2024 01:33:16 AM

  1. సీఎం, మంత్రుల మధ్య పొసగని పొత్తు
  2. ఎవరి శాఖకు వారే పరిమితం 
  3. ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో వైఫల్యం
  4. మంత్రులపైన విమర్శలొచ్చినా పట్టించుకోని సహచర మంత్రులు

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాం తి): రాష్ట్ర ప్రభుత్వంలో సమన్వయలోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతోపాటు పార్టీ నాయకులు ‘ఎవరికి వారు యమునా తీరు’గా సాగుతోంది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను దీటుగా ఎదుర్కోవడంలో మం త్రులు, అధికార పార్టీ నాయకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒక శాఖపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తే సంబంధిత శాఖ మంత్రే స్పందించాల్సి వస్తుందని, మిగతా మంత్రు లు తమకేమీ పట్టనట్టగా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారిం ది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తే.. మంత్రులు, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఒకేసారి విపక్షాలపై  మూకుమ్మడి దాడి చేసేవారని గుర్తుచేసుకుంటున్నారు.

కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పరిస్థితి కనిపించడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రధానంగా సీఎం రేవంత్‌రెడ్డికి కూడా ఈ పరిస్థితి తప్పడం లేదని, కొన్ని సందర్భాల్లో ఆయనే స్వయం గా వివరణ ఇచ్చుకోవాల్సిన స్థితి తలెత్తిందనే చర్చా జరుగుతోంది. సీఎం వద్ద హోం, విద్య, మున్షిపల్ అడ్మినిస్ట్రేషన్ తదితరల శాఖలు ఉన్నాయి.

అక్రమణకు గురైన చెరువులు, కుంటలు కాపాడేందుకు హైడ్రాను తీసుకొచ్చారు. దీంతో మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం పెద్ద కార్యక్రమాన్నే చేపట్టింది. మూసీ, హైడ్రా విషయంలో  బీఆర్ ఎస్, బీజేపీలు సర్కార్‌పై యుద్ధమే ప్రకటించాయి.

మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, ఢిల్లీ పెద్దలకు మూటలు పంపించేం దుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని బీఆర్‌ఎస్ నేతలు సర్కార్‌ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాల విమర్శలకు అధికార పక్షం నుంచి పెద్దగా ఎదురుదాడి రాలేదని కాంగ్రెస్ కార్యకర్తలే అన్నారు.

సీఎం స్పందించిన తర్వాతే మంత్రులు, పార్టీ నేతలు విప క్షాలపై ప్రతి విమర్శలు చేశారన్న చర్చా జరుగుతోంది. ఈ విషయంలో ఒకరిద్దరు మం త్రులు స్పందించినా, సీనియర్ మంత్రుల నుంచి సహకారం లభించడం లేదని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. 

గ్రూప్1 విషయంలోనే అదేతీరు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉద్యోగ నియామకాల్లోనూ ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శల దాడిని ఎదుర్కొనే అంశాన్ని మంత్రులు పట్టించుకో లేదన్న విమర్శలు వచ్చాయి. జీవో 29 వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యా యం జరుగుతుందని, పరీక్షలు వాయిదా వేసి జీవో ను సవరించాలని ప్రతిపక్షాలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాయి.

జీవో 29 వల్ల ఎవరికి అన్యాయం జరగదని సీఎం రేవంత్‌రెడ్డి మొదట స్పందించాల్సి వచ్చిందని, ఆ తర్వాత పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తప్ప మిగతా మంత్రులు, పార్టీ నాయకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదనే కాంగ్రెస్ వర్గాలే చెప్తుండటం గమనార్హం. సినీ నటుడు నాగార్జున కుటుంబంపై  మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి.

అయితే, ఈ విషయంలోనూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వెంటనే జోక్యం చేసుకోవడంతో వివాదం కొంతమేర సద్దుమణిగినా.. బీఆర్‌ఎస్, సినీవర్గాల నుంచి వచ్చిన విమర్శలకు   మంత్రి సురేఖనే స్పందించాల్సిన పరిస్థితి నెలకొన్నది. మిగతా మంత్రుల నుంచి సురేఖకు మద్దతు కరువైందనే చర్చా జరిగింది.

అంతే కాకుండా కొండా సురేఖపై సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం విషయంలోనూ సహచర మంత్రులు, పార్టీ నుంచి అనుకున్నంతగా మద్దతు లభించలేదని వాదన ఉన్నది. మంత్రి సీతక్కపైన కూడా బీఆర్‌ఎస్ చేసిన విమర్శలకు స్వయంగా ఆమెనే స్పందించాల్సిన పరిస్థితి నెలకొందనే ప్రచారం ఉంది.