15-03-2025 12:00:00 AM
నేడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం
సిద్దిపేట, మార్చి 15 (విజయక్రాంతి): వినియోగదారుల రక్షణ చట్టం 1986 లో రూపొందించినప్పటికి 1996, 2022 లో సవరణ చేసి మార్చి15 నాడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవంగా జరపుతున్నారు. ఈ చట్టంతో వియోగదారులకు కొన్ని హక్కులు సంక్రమించాయి. వాటి ఉల్లంఘనలు జరిగినచో వినియోగదారుల ఫోరం లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినియోగదారుల ఫోరం గతంలోనే ఏర్పాటు చేసిన అవి ఇప్పుడు కనుమరగైనట్లు తెలుస్తోంది. ఉత్పత్తిదారుల, విక్రయదారుల నుంచి వినియోగదారులకు నష్టం, మోసం, నాణ్యతలో లోపం జరిగినప్పుడు ప్రభుత్వ అధికారులను ఆశ్రయించిన న్యాయం జరగకపోతే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఈ ఫోరం ప్రభుత్వంతో కలిసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
కానీ ఇప్పుడు వినియోగదారుల అవగాహన కాదుకదా కనీసం వారు చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. వినియోగదారుల రక్షణ, సంక్షేమ సంఘాలు, స్వయం సేవ, స్వచ్ఛంద సంస్థల సేవలు వినియోగదారుల కోసం పని చేశాయి.
వినియోగదారు డే రారాజు అనే విధంగా కొన్నాళ్ళు ప్రయాణం సాగిన వినియోగదారుల వ్యవహారాలు, ఉత్పత్తిదారుల, విక్రయదారులు చేసే మోసాలను తప్పుడు ప్రకటనల రూపంలో అమ్మకాలను తప్పించుకొనే స్థాయికి ఎదిగి చైతన్య వంతమైన వినియోగదారుడుగా ఎదిగారు.
కాగా తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటు కాగానే వినియోగదారుల వ్యవహారాలు చూసే వ్యవస్థనే మూలకు పడేశారు. శాఖా పరంగా కేవలం జాతీయ, అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవాలను ఒక్క రోజుతో నామ మాత్రంగా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసి తూతూ మంత్రంగా చేస్తున్న సందర్భాలున్నాయి.
ప్రజారోగ్యం కోసం ఎంతో చేస్తున్నాం అంటున్న పాలక ప్రభుత్వాలు ఆహార ఔషధ కల్తీని నివారించడం లో ఘోరంగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్తీ దారులకు యావజ్జీవ కారాగార శిక్ష పడిన సంఘటనలు గతంలో ఉన్నాయి.
కల్తీ ఆహార పదార్థాల ఉత్పత్తులు, పౌర సేవలలో అసౌకర్యం, ప్రభుత్వ అధికారుల సేవలలో ఆలస్యం ఇలాంటి వాటికి ప్రజా నాయకులు అండగా ఉండటం వల్లనే వినియోగదారులకు న్యాయం జరగడం లేదనేది అందరికీ తెలిసిందే అందుకే ప్రజల కోసం సేవలందించిన ఫోరం పనిచేయడం లేదని తెలుస్తోంది.
విద్యాహక్కు ఒక వ్యాపారంగా మారిందని, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాలలో, ఆస్పత్రులలో ప్రజలకు సరైన సేవలు అందడం లేదు, బాధితులు ఎవరిని ఆశ్రయించాలి తెలియదు, ఇలాంటి సంఘటనలు అనేకంగా ఉన్నప్పటికీ ప్రభుత్వాలు జోక్యం చేసుకోకపోవడం దారుణమని చెప్పవచ్చు.
ప్రస్తుత కాలంలో వినియోగదారుల వ్యవహారాలు చూసే వ్యవస్థనే మళ్ళీ జవసత్వాలు తొడిగి విసిఓ (విలేజ్ కన్జ్యూమర్స్ ఆర్గనైజేషన్) లను బలోపేతం చేయాలని నాణ్యమైన ఆహారం, సరుకులను, సేవలను పొందే విధంగా చర్యలు తీసుకోవాలని తునికల కొలతల శాఖ, పౌర సరఫరాల శాఖ ఆహార ఔషధ నియంత్రణ శాఖలను మేలుకోల్పితే వినియోగదారులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.
కార్యాలయాలకే పరిమితం ... డాక్టర్. విజయ్ కుమార్, నేషనల్ కన్స్యూమర్స్ అవార్డు గ్రహీత.
వినియోగదారుల సేవల అవగాహన కార్యక్రమాలు కేవలం కార్యాలయంలో ఒక్క రోజుకే పరిమితం కావొద్దు. ఇప్పటికైనా ప్రభుత్వంలో వినియోగదారుల విభాగాన్ని బలోపేతం చేయాలి. ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ అధికారులతో కూడిన వినియోగదారుల సేవ సంఘాన్ని ఏర్పాటు చేయాలి. గతంలో మాదిరిగా వినియోగదారునికి ఆ సేవా సంఘాలు అండగా నిలిచే విధంగా కృషి చేయాలి.
వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. వినియోగదారుల పక్షాన ప్రభుత్వాలు నిలిచినప్పుడే నాణ్యమైన సేవలు అందుతాయి. తెలంగాణ స్వరాష్ట్రంలో వినియోగదారులకు ప్రత్యేక శాఖ లేకపోవడం అత్యంత బాధాకరం. వినియోగదారులను చైతన్య పరచాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది.