calender_icon.png 8 February, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ జేఏసీ, యాజమాన్యాన్ని చర్చలకు పిలిచిన కార్మికశాఖ

08-02-2025 01:25:22 AM

ఈ నెల 10న చర్చలకు రావాలంటూ నోటీసులు

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): సమస్యల పరిష్కారం కోసం పలు డిమాండ్లతో ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీలోని ఆరు యూనియన్లను, ఆర్టీసీ యాజమాన్యాన్ని శుక్రవారం కార్మిక శాఖ కమిషనర్ చర్చలకు పిలిచారు. ఈ నెల 10న సాయంత్రం 4 గంటలకు కార్మికశాఖ జాయింట్ కమిషనర్ కార్యాలయంలో చర్చలకు రావాలని ఆహ్వానించారు.

ఆర్టీసీని యాజమాన్యం, సర్కార్ కలిసి ప్రైవేటీకరించేందుకు కుట్ర పన్నుతున్నారని, ఫలితంగా అందులో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల ఉద్యోగాలు, భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని పేర్కొంటూ ఆరు కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి గతనెల 27న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చాయి.

ఫిబ్రవరి 9వ తేదీ లేదా ఆ తర్వాత నుంచి తమ సమ్మె కొనసాగుతుందని నోటీసులో పేర్కొన్నాయి. అయితే నోటీసు అందించిన తర్వాత ఫిబ్రవరి 6వ తేదీ వరకు కూడా యాజమాన్యం, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనికి తోడు కార్మికశాఖ నుంచి కూడా స్పందన రాకపోవడంతో తమ సమ్మె కొనసాగుతుందంటూ ఆర్టీసీ జేఏసీ మరోసారి ప్రకటించింది.

ఈ నేపథ్యంలోనే శుక్రవారం కార్మికశాఖ జాయింట్ కమిషనర్ నుంచి ఆర్టీసీ జేఏసీలోని సంఘాలకు, యాజమాన్యానికి నోటీసులు అందాయి. అయితే చర్చలకు వచ్చే యాజమాన్యం, జేఏసీ మధ్య చర్చలు ఫలప్రదం అవుతాయా లేదా అనే దానిపై ఆర్టీసీ సమ్మె నిర్ణయం ఆధారపడి ఉంటుందని జేఏసీ నేతలు చెబుతున్నారు.

ఇదంతా ఆర్టీసీ ఎండీ చేస్తున్న తతంగం..

ఇన్నాళ్లుగా ట్రేడ్ యూనియన్లకు గుర్తింపు లేదంటూ కార్మిక సంఘాలనే కాకుండా ప్రభుత్వాన్ని కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తప్పుదారి పట్టించారని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి ఆరోపించారు. ట్రేడ్ యూనియన్లను కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రద్దు చేశారంటూ అందరినీ ఆయన మోసం చేశారని పేర్కొన్నారు.

ఒకవేళ ట్రేడ్ యూనియన్లను రద్దుచేసి ఉంటే ఆర్టీసీ సమ్మె నోటీసు ఇచ్చిన 6 సంఘాలను చర్చలకు రావాలని కార్మిక శాఖ ఎందుకు పిలుస్తుందని ప్రశ్నించారు. ఆర్టీసీ యాజమాన్యం చేస్తున్న గిమ్మిక్కులను కార్మికులు చూస్తూ ఊరికే ఉండరని థామస్‌రెడ్డి హెచ్చరించారు.