calender_icon.png 13 February, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాడవాడన కార్మిక దినోత్సవం

02-05-2024 01:56:42 AM

రాజకీయ పార్టీల, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు

మే డే విశిష్టతను వివరించిన వక్తలు

పలుచోట్ల అన్నదానాలు.. సేవా కార్యక్రమాలు

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరిగాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆయా పార్టీలకు సంబంధించిన కార్మిక సంఘాల జెండాలను ఆవిష్కరించారు. వక్తలు మే డే విశిష్టతను వివరించారు. పలుచోట్ల నిర్వాహకులు కార్మికులకు అన్నదానం చేశారు.   నెట్‌వర్క్ తెలంగాణ ఉద్యమంలో కార్మికుల పాత్ర అద్వితీయం

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాం తి): ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కార్మికుల పాత్ర అద్వితీయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మే డేలో ఆయన జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి అనేక సభల్లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని లేనిపోని శపథాలు చేస్తున్నారని, ప్రజల మనస్సుల్లోంచి కేసీఆర్‌ను తీసేయడం రేవంత్‌రెడ్డి జేజమ్మ వల్ల కూడా కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, అంబేద్కర్ సచివాలయం, యాదాద్రి ఆలయ నిర్మాణంలో కార్మికుల కష్టం అనిర్వచనీ యమన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ బొగ్గుబావి కార్మికులకు ఎంతో మేలు చేశారన్నారు. కరోనా సమయంలో కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు ఎంతో కష్టపడ్డారని, కానీ మోదీ ప్రభుత్వం వారిని పట్టించుకోలేదని గుర్తుచేశారు.

కార్మికులు స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇసుమైంతైనా సాయం చేయలేదన్నారు. కానీ బీజేపీ నేతలు కార్మికులను ఆదుకున్నామని ఇప్పుడు గప్పాలు కొడుతున్నారని నిప్పు లు చెరిగారు. ప్రధాని మోదీనే కరోనా వ్యాక్సిన్ కనుగొన్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్తున్న లేనిపోని గొప్పలను చూసి జనాలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచమంతా ముడిచమురు ధరలు తగ్గుతుంటే కేంద్రం ఎందుకు చమురు ధరలను తగ్గించడం లేదని ప్రశ్నించారు. సెస్ పేరిట కేంద్రం రాష్ట్రం నుంచి రూ.30 లక్షల కోట్లు తీసుకెళ్లారని, కానీ తెలంగాణకు మాత్రం పైసా విదిల్చలేదని మండి పడ్డారు. ఈ విషయంలో ఎవరైనా ప్రశ్నిస్తే జాతీయ రహదారులు నిర్మించినట్లు బీజే పీ నేతల నుంచి సమాధానం వస్తుందన్నారు. అలాగే అయితే టోల్ ప్లాజాల వద్ద ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.

బీజేపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా అంబానీ, అదానీల లక్షల కోట్ల అప్పులను మాఫీ చేసిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సామాజిక న్యాయం పాటించిందన్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఐదు రిజర్వేషన్ స్థానాలు కాగా, మిగతా 12 సీట్లలో ఆరు సీట్లను బీసీలకు కేటాయించామన్నారు. ఎన్నికల్లో పార్టీకి 10  12 సీట్లు వస్తే రాష్ట్ర రాజకీయాలను శాసిం చే స్థాయికి వస్తామన్నారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో..

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో సీఐటీ యూ ఆధ్వర్యంలో మే డే వేడుకలు జరిగా యి. సీఐటీయూ రంగారెడ్డి జిల్లా శ్రామిక మహిళా కన్వీనర్ కవిత హాజరై జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు జాజాల రుద్రకుమార్, రామ్మోహన్‌రావు, భావన, కురుమయ్య పాల్గొన్నారు. 

కాటేదాన్‌లో...

మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని కాటేదాన్ ప్రాంతంలో జరిగిన వేడుకలో ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి సతీమణి సీతా రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో ఏఐటీయూ సీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. 

గండిపేట్ మండలంలో.. 

గండిపేట మండలంలోని నార్సింగి చౌర స్తా వేడుకలో  సీపీఐ కంట్రోల్ కమిషన్ సభ్యుడు పుస్తకాల నర్సింగ్‌రావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్.మల్లేష్ పాల్గొ న్నారు. కార్యక్రమంలో నాయకులు శంకరయ్య, స్వామి, మైపాల్, శ్రీను, ఎల్లయ్య, డప్పు ప్రవీణ్‌కుమార్, అశోక్ పాల్గొన్నారు.

మేడ్చల్ జిల్లాలో..

మేడ్చల్  జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఘనంగా కార్మిక దినోత్సవం జరిగింది. బాలానగర్, కేపీహెచ్‌బీ కాలనీ వేడుకల్లో ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులకు కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఆంధ్రా పాలిమర్స్ లో వేడుకలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన వేడుకలో ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు హాజరయ్యారు. బీఆర్‌ఎస్కేవీ జెండాను ఆవిష్కరించారు. 

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం ఆధ్వర్యంలో మే డే జరిగింది. ఈ సందర్భంగా ఆయన సంఘం జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు మహిపాల్, నర్సయ్య పాల్గొన్నారు.

ఖమ్మంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో..

ఖమ్మం నగరంలోని గాంధీచౌక్‌తోపాటు రూరల్ మండలంలోని ఏదులాపురంలో జరిగిన వేడుకలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి కాంగ్రెస్ నాయకులు లక్ష్మీనారాయణ, స్వర్ణకుమారి, నిరంజన్‌రెడ్డి, ముస్తఫా, దీపక్ చౌదరి, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు. 

కార్మికుల సంక్షేమమే ధ్యేయం 

కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్‌ఎస్ పనిచేస్తుందని మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయం లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోకలిసి కార్మికుల దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ జెండాను అవిష్కరించారు. బీఆర్‌ఎస్ అం దరికీ రక్షణ కవచంలా ఉంటుందని మన్నె శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ శ్రేణులు, కార్మికులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.