calender_icon.png 23 December, 2024 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మినీ ఇండియాలా కువైట్

22-12-2024 02:06:33 AM

* హృదయాలతో ఇరుదేశాల అనుసంధానం

* ప్రవాస భారతీయులతో నరేంద్ర మోదీ సమావేశం

* కువైట్ చేరుకున్న ప్రధాని

* ఘనస్వాగతం పలికిన కువైట్ అధికారులు

* 43 ఏళ్ల తరువాత గల్ఫ్ దేశంలో పర్యటిస్తున్న పీఎం

న్యూఢిల్లీ/కువైట్, డిసెంబర్21: కువైట్ మినీ ఇండియాలా ఉందని ప్రధాని మోదీ అన్నారు. రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం కువైట్ దేశానికి చేరుకున్నారు. కువైట్ రాజు షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జుబేర్ అల్ సబహ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ కువైట్ దేశంలో పర్యటిస్తున్నారు. భారత ప్రధా ని కువైట్‌కు వెళ్లడం 1981( దాదాపు 43 ఏళ్ల) తరువాత ఇదే తొలిసారి. ఈక్రమంలో శనివారం ఉదయం ఢిల్లీ నుంచి మోదీ బయలు దేరి కువైట్‌కు వెళ్లారు. కువైట్‌లో దిగగానే మో దీకి అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికా రు. ఈ సందర్భంగా భారతీయులు నిర్వహించి న సాంస్కృతిక కార్యక్రమాలను మోదీ తిలకించారు. ప్రవాస భారతీయులంతా చప్పట్లు, వందేమాతరం నినాదాలతో హోరెత్తిస్తుండగా అక్కడున్న వారందరినీ మోదీ పలకరించారు. 

మినీ ఇండియాలా ఉంది.. 

శనివారం కువైట్ చేరుకున్న మోదీ.. అక్కడున్న ప్రవాస భారతీయులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భారతీయులు  ఏర్పాటు చేసిన “హలా మోదీ” కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. భారత్, కువైట్‌ల మధ్య సంబంధం నాగరికతలకు, సముద్రానికి, వాణిజ్యానికి సంబంధించినదని అన్నారు. ఇరుదేశాలు సముద్రం ఒడ్డున ఉన్నాయని తెలిపారు. దౌత్యం ద్వారా మాత్రమే కాకుండా హృదయాలతో కూడా రెండు దేశాలు అనుసంధానించబడ్డాయని పేర్కొన్నారు.

భారత్  నుంచి కువైట్ రావడానికి 4 గంటల సమయం పడితే.. ఓ భారత ప్రధాని కువైట్ రావడానికి నాలుగు దశాబ్దాల సమయం పట్టిందని మోదీ అన్నారు. ప్రతి ఏటా వందలమంది భారతీయులు కువైట్‌కు వచ్చి కువైట్ సమాజానికి భారతీయతను పరిచయం చేస్తున్నారని కొనియాడారు. భారత ప్రతిభ, సాంకేతికత, సంప్రదాయాలనను మేళవించి కువైట్ నేలను భారతీయ నైపుణ్య రంగులతో నింపారని ప్రశంసించారు. కువైట్ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో భారత ఉపాధ్యాయులు కీలకంగా మారారని, కష్టపడి పనిచేయడం వల్లనే ఈ ఘనత సాధ్యమైందన్నారు. 

భారత ఇతిహాసాల అనువాదకులతో భేటీ..  

భారత ఇతిహాసాలైన రామాయణం, మహాభారతాలను అరబిక్ భాషలో అనువదించి ప్రచురించిన ఇద్దరు స్థానికులను కలుసుకోవడం ద్వారా మోదీ కువైట్‌లో తన చారిత్రాత్మక పర్యటనను ప్రారంభించారు. కువైట్‌లో దిగిన తరువాత రామాయణం, మహాభారతాలను అనువదించిన కువైట్ స్థానికులు అబ్దుల్లా అల్ బరూన్, అరబిక్ అనువాదాన్ని ప్రచురించిన అబ్దుల్ లతీఫ్ అల్ నెసెఫ్‌లనూ మోదీ అభినందించారు. రెండు ఇతిహాసాల అరబిక్ అనువాదాల కాపీలపై కూడా మోదీ సంతకం చేశారు. అనువాదానికి దాదాపు రెండేళ్ల ఎనిమిది నెలలు పట్టిందని ఈ సందర్భంగా మోదీ అడిగిన ప్రశ్నకు అల్ నెసెఫ్ చెప్పారు. తాము ప్రచురించిన అరబిక్  రామాయణ, మహాభారత పుస్తకాలను చూసి మోదీ సంతోషిం చారని వారు తెలిపారు. 1961లో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. 

నెటిజన్ కోరికతో హండాను కలిసిన మోదీ.. 

కువైట్  పర్యటనలో భాగంగా తన తాత, మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి మంగళ్‌సేన్ హండా(101)ను కలవాల్సిందిగా ప్రధాని మోదీని ఎక్స్ వేదికగా ఆయన మనువరాలు శ్రేయా జునేజీ అభ్యర్థించారు. మోదీకి తన తాత గొప్ప ఆరాధకుడని పేర్కొన్నది. ఈ క్రమంలో ఆమె కోరికను మోదీ అంగీకరించారు. కువైట్ చేరుకున్న అనంతరం మోదీ ప్రవాస భారతీయులతో చర్చ సందర్భంగా హండాను కలిశారు. హండాను ప్రత్యేకంగా కలిసి ఆత్మీయంగా మాట్లాడారు. ఆ చిన్నారికి ఇచ్చిన మాటను మోదీ నిలబెట్టుకున్నారు.