calender_icon.png 27 October, 2024 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రానికి కురియన్ కమిటీ

11-07-2024 02:40:40 AM

  1. నియమించిన కాంగ్రెస్ అధిష్ఠానం
  2. రెండు రోజులు రాష్ట్రంలోనే మకాం 
  3. నేడు అభ్యర్థులందరితో భేటీ కానున్న సభ్యులు
  4. రేపు అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్‌చార్జ్‌లతో సమావేశం 

పార్లమెంట్ ఎన్నికల్లో వైఫల్యంపై కారణాల అన్వేషణకు..

హైదరాబాద్, జులై 10 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తక్కువ సీట్లకు గల కారణాలపై వాస్తవాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ సీనియిర్ నేత కురియన్ నేతృత్వంలో నియమించిన నిజ నిర్ధారణ కమిటీ బుధవారం రాష్ట్రానికి వచ్చింది. రెండు రోజుల పాటు ఇక్కడే ఉం డి ఫలితాలపై క్షేత్రస్థాయిలో వెళ్లి తెలుసుకోనున్నారు. మొదట ఓటమి పాలైన అభ్యర్థులతో సమావేశమై ఓటమికి గల కారణాలు, నాయకుల నుంచి అందిన సహకారం.. వంటి విషయాలను ఆరా తీయనున్నారు. తర్వాత గెలిచిన వారితోనూ కమిటీ భేటీ కానున్నది. ఎన్నికల్లో అనుసరించిన విధానాలను తెలుసుకోనున్నారు. రెండో రోజు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలతోనూ సమావేశం అవుతారు. అభ్యర్థుల విజయం కోసం పని చేసిన నాయకులు, పోటీ చేసిన అభ్యర్థుల అనుసరించిన ఎత్తుగడల పైనా కమిటీ ఆరా తీయనున్నది. ఇలా మూడు దశల్లో సమవేశాలు నిర్వహించి, నివేదికను అధిష్ఠానానికి అందజేయనున్నారు. 

రాష్ట్రంలోని 17 లోక్‌సభ  సీట్లలో కాం గ్రెస్ కనీసం 14 సీట్లలో విజయం సాధించాలని.. ఆ దిశగా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. అయితే హస్తం 8 సీట్లకే పరిమితం కావడం, బీజేపీ 4 నుంచి 8 సీట్లకు పెరగడంపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువ సీట్లను ఆశిం చింది. ఈ రాష్ట్రాల్లో ఆశించిన మేర ఎంపీ సీట్లలో విజయం సాధించకపోవడంతో ఆ ప్రభావం ఇండియా కూటమిపై చూపిందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రె స్‌కు ఎక్కువ సీట్లు వస్తే ఎన్డీయే కూటమికి మెజార్టీ తగ్గి కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉండేదన్న భావ నలో ఉన్నారు. 

తెలంగాణలో బీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీకి మల్లడంతోనే కాంగ్రెస్‌కు తక్కువ సీట్లు వచ్చాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 శాతం ఓటింగ్‌ను సాధించుకున్న బీఆర్‌ఎస్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి 14 నుంచి 15 శాతానికి పడిపోయిందని, అందుకే కాంగ్రెస్‌కు సీట్లు తక్కువగా వచ్చాయని చెబుతున్నారు. బీఆర్‌ఎస్ ఒక్క ఎంపీ సీటు ను గెలుచుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ లో మరో కోణం కూడా వినిపిస్తోంంది. ఐదారు పార్లమెంట్  నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలోనూ పొరపాట్లు జరిగాయని చెబుతున్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, మెదక్ అభ్యర్థుల ఎంపిక విషయంలో తప్పిదం జరిగిందంటున్నారు. మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన పట్నం సునితామహేందర్‌రెడ్డి చేవెళ్ల నుంచి బరిలోకి దింపితే కాంగ్రెస్ గెలవడానికి ఆస్కారం ఉండేదని చెబుతున్నారు. ఇక మల్కాజిగిరిలో రంజిత్‌రెడ్డిని కాకుండా స్థానిక వ్యక్తిని పోటీ చేయిస్తే బాగుండేదని అభిప్రాయం అప్పట్లోనే వ్యక్తమైంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనూ బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కాకుండా మరో బీసీ వ్యక్తిని బరిలోకి దింపితే గెలిచేందుకు అవకాశం ఉండేదంటున్నారు. మెదక్ విషయంలోనూ అదే జరిగిందని పార్టీ నాయకుల అంతర్గత సమావేశంలోనూ చర్చ జరుగుతోంది.