27-03-2025 12:02:41 AM
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశిస్తూ పేరడీ పాట
న్యూఢిల్లీ: ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై కామ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ జరుగుతుండగానే తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశిస్తూ కునాల్ మరో పాట పాడారు. ‘మిస్టర్ ఇండియా’ సినిమాలోని ‘హవా హవాయి’ పాటను పేరడీ చేసిన ఆయన ‘ఆప్కా టాక్స్ కా పైసా హో రహా హై హవా హవాయి’ అని పాడారు.
పన్ను చెల్లింపుదారుల సొమ్ము వృథా అవుతోందంటూ ఆరోపించారు. అందులోనే ట్రాఫిక్ ఇబ్బందులు, వంతెనలు కూలిపోవడం వంటి వాటి గురించి ప్రస్తావిస్తూ బీజేపీ నియంతృత్వ పాలన సాగిస్తుందని విమర్శించారు. మరోవైపు ఏక్‌నాథ్ షిండేపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పనని కునాల్ కామ్రా ఇప్పటికే స్పష్టం చేశారు. షిండే గురించి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్న మాటలనే తాను చెప్పానన్నారు. దాడులకు పాల్పడుతున్న వారిని చూసి భయపడనంటూ కునాల్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో నమోదైన కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని పోలీసులు సమన్లు ఇచ్చినప్పటికీ కునాల్ హాజరు కాలేదు. వారం రోజుల గడువు కావాలని కునాల్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన పోలీసులు రెండోసారి సమన్లు జారీ చేశారు.