- మూడేళ్ల క్రితం వర్షాలతో తెగిపోయే స్థితికి ఆనకట్ట..
- మరమ్మతులు చేపట్టని ప్రభుత్వాలు
- కవర్లతో కప్పి ఉంచిన ఇంజనీరింగ్ అధికారులు
కుమ్రంభీం ఆసిఫాబాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కుమ్రంభీం ప్రాజెక్టు నిర్వహణపై ప్రభుత్వాల పట్టింపులేనితనంతో ప్రమాద ఘంటికలు మొగుతున్నాయి. రూ.750 కోట్లతో 45 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలన్న ఉద్దేశంతో చేపట్టిన ప్రాజెక్ట్ నిర్మాణంలో నాణ్యత లోపించినట్లుగా స్పష్టమవతున్నది. 10 టీఎంసీల నీటి నిల్వ సామ ర్థ్యం ఉన్న ప్రాజెక్టు ప్రస్తుతం 5 టీఎంసీలకే పరిమితం అవుతున్నది. ప్రాజెక్టు ఆనకట్ట మూడేళ్ల క్రితం కురిసిన అధిక వర్షాలతో తెగిపోయే పరిస్థితికి చేరింది. మరమ్మతులు చేయకుండానే ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆనకట్టకు కవర్లు కప్పి ఉంచడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
పెండింగ్‌లో బిల్లులు.. విద్యుత్ కనెక్షన్ కట్
ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆ శాఖ అధికారులు మూడేళ్ల క్రితమే విద్యుతును తొలగించారు. దీంతో జనరేటర్ సహాయంతో గేట్లను ఎత్తుతున్నారు. భారీగా ప్రాజెక్టులోకి వరదనీరు చేరితే గేట్లు ఎత్తే సమయంలో జనరేటర్ పనిచేయకపోతే ఆనకట్ట తెగిపోయే ప్రమాదం ఉంది. ప్రాజెక్టు కాలువ సైడ్‌వాల్ సైతం దాదాపు 35 మీటర్ల పొడవునా కూలిపోయినప్పటికీ పునర్నిర్మాణ చేపట్టలేదు. ప్రమా దవశాత్తు ప్రాజెక్టు ఆనకట్ట తెగిపోతే లోతట్టు గ్రామాలు మునిగిపోయే అవకాశాలు లేకపోలేదు. దీంతో దిగువనున్న గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
ఒక్క ఎకరాకూ అందని నీరు
ప్రాజెక్టు ప్రారంభించి దాదాపుగా 11 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు ఒక్క ఎకరానికి కూడా నీరందలేదు. సాగుకు నీరందించకపోవడంతో ప్రజాప్రతినిధులు, అధికారుల పనితీరుపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు, అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టడంతో పాటు కాలువల నిర్మాణం పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.