పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ మరోమారు మెరిశాడు. భీకర ఫామ్‌లో ఉన్న కిషన్ తాజాగా జరుగుతున్న విజయ్‌హజారేలో సెంచరీతో కదం తొక్కాడు. జార్ఖండ్‌కు ఆడుతున్న కిషన్ మణిపూర్‌తో మ్యాచ్‌లో శతక్కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. కిషన్ ప్రదర్శనతో సన్ రైజర్స్ మేనేజ్‌మెంట్‌తో పాటు.. అభిమానులు కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు.
విజయక్రాంతి ఖేల్ విభాగం: విజయ్‌హజారే ట్రోఫీ మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. అన్ని జట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. త్వరలోనే చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించే అవకాశం ఉండడంతో జట్టులో చోటే లక్ష్యంగా క్రికెటర్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. సెంచరీల మోతతో మ్యాచ్‌లన్నీ మార్మోగిపోతున్నాయి. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం అందుతోంది. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో కూడా పలువురు క్రికెటర్లు సెంచరీలతో కదం తొక్కారు.
చండీఘర్ తరఫున శివం బాంబ్రి (152), చత్తీస్‌గఢ్ ఆటగాడు అమన్‌దీప్ (121), విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ (112*), రైల్వేస్ తరఫున సూరజ్ అహుజా (112), బీహార్‌కు చెందిన మంగల్ (106), బరోడా ఆటగాడు నినద్ (136), కర్ణాటకలో సమ్రన్ రవిచంద్రన్ (100), హర్యానాలో హిమాన్షు రానా (101), అంకిత్ కుమార్ (128*), గుజరాత్‌లో ఆర్య దేశాయ్ (106), జార్ఖండ్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్ (134), రాజస్థాన్‌లో రామ్మోహన్ (120), లామ్రోర్ (134*), మహారాష్ట్రలో రుతురాజ్ గైక్వాడ్ (148*), హిమాచల్ ఆటగాడు చోప్రా (134) సెంచరీలు చేసిన వారిలో ఉన్నారు. యూపీ తరఫున శివం మావి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
యూపీ 9 వికెట్ల తేడాతో, విదర్భ ఆరు వికెట్ల తేడాతో, పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో, రైల్వేస్ 132 పరుగుల తేడాతో, త్రిపుర ఐదు వికెట్ల తేడాతో, ఢిల్లీ 79 పరుగుల తేడాతో, బరోడా 62 పరుగుల తేడాతో, సౌరాష్ట్ర 8 వికెట్ల తేడాతో, ముంబై 3 వికెట్ల తేడాతో, కర్ణాటక 3 వికెట్ల తేడాతో, హర్యానా 8 వికెట్ల తేడాతో, గుజరాత్ ఐదు పరుగుల తేడాతో, అస్సాం ఐదు వికెట్ల తేడాతో, జార్ఖండ్ 8 వికెట్ల తేడాతో, రాజస్థాన్ తొమ్మిది వికెట్ల తేడాతో, మహారాష్ట్ర 9 వికెట్ల తేడాతో, హిమాచల్ 95 పరుగుల తేడాతో విజయాలు సాధించాయి. ఇక చత్తీస్‌గఢ్ వీజేడీ పద్ధతిలో 13 పరుగుల తేడాతో గెలిచింది.
ఇక్కడ కూడా ఇ‘షాన్’
సన్ రైజర్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ తన విలువేంటో మరోసారి చాటి చెబుతున్నాడు. క్రమశిక్షణ కారణాలతో జాతీయ జట్టుకు దూరమైన కిషన్ కసి మీద ఆడుతున్నాడు. ఎలాగైనా జాతీయ జట్టులోకి రావాలనే కసి కిషన్‌లో కనబడుతోందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో రూ. 11.40 కోట్లు వెచ్చించి హైదరాబాద్ కిషన్‌ను కొనుగోలు చేసింది. కిషన్ తాజా ప్రదర్శనలతో హైదరాబాద్ యాజమాన్యంతో పాటు అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.
తిలక్‌కు ఏమైంది?
సఫారీ టూర్, సయ్యద్ ముస్తాక్ ట్రోఫీల్లో దుమ్ములేపిన హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ 50 ఓవర్ల టోర్నీ అయిన విజయ్ హజారేలో మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో వర్మ డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం. తొలి మ్యాచ్‌లో మూడు బంతులాడిన తిలక్, రెండో మ్యాచ్‌లో మరీ దారుణంగా రెండు బంతులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. రెండు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ ఒకదాంట్లో గెలిచి మరోదాంట్లో ఓటమి పాలైంది.