- మేళాకు ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఆదరణ గర్వకారణం
- ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం ఎంతో ప్రత్యేకం
- రాజ్యాంగం అందించిన వారికి శిరస్సువంచి నమస్కారాలు
- మన్‌కీ బాత్‌లో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం
న్యూఢిల్లీ, జనవరి 19: ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా జరుగుతున్న మహాకుంభమేళా భారతీయ సంస్కృతికి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలను కుంభమేళా ఏకతాటిపైకి తీసుకొచ్చిం దన్నారు. ప్రపంచ దేశాల ప్రజలు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తు న్నారని తెలిపారు.
కుంభమేళాకు పెద్ద సంఖ్యలో వస్తున్న యువతను అభినందించారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఆదరణ ప్రతీ భారతీయుడికి గర్వకారణమని చెప్పారు. మనసులో మాట పేరుతో ప్రతినెలా చివరి ఆదివారం నిర్వహించే మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
అయితే.. ఈ నెలలో చివరి ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో మూడో ఆదివారం రోజు మన్‌కీ బాత్ 118వ ఎపిసోడ్ ప్రసారం చేశారు. ‘ఈ రిపబ్లిక్ డే చాలా ప్రత్యేకమైంది. ఈ ఏడాది రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తవుతుంది. పవిత్ర రాజ్యాంగాన్ని మనకు అందించిన రాజ్యాంగ పరిషత్‌లోని గొప్ప వ్యక్తులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని మోదీ అన్నారు.
ఎన్నికల ప్రక్రియను ఈసీ పటిష్ఠం చేస్తోంది..
ఎన్నికల సంఘం (ఈసీ) ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆధునీకరించి, పటిష్ఠం చేస్తోందని ప్రధాని కొని యాడారు. ప్రజాశక్తిని బలోపేతం చేయడానికి సాంకేతికతను ఉపయోగిస్తూ.. నిష్పక్షపాతంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తోందన్నారు. యువత స్టార్టప్‌ల వైపు ఆకర్షితులవుతున్నారని.. దీంతో స్టార్టప్ ఇండియా రూపుదిద్దుకుంటుందన్నారు. దీపక్ నబం అనే వ్యక్తి తాను స్థాపించిన అంకుర సంస్థ ద్వారా నిరాశ్రయులకు సాయం చేస్తున్నాడని ప్రశంసించారు.