25-03-2025 04:24:55 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) అధ్యక్షుడిగా కుమ్మరి రాంబాబు నియమితులయ్యారు. మంగళవారం భద్రాచలం పట్టణంలోని నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ విషయాన్ని పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు తడికల శివకుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ... రాజకీయ అధికారంలో లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత మైనారిటీల హక్కులు హరణకు గురయ్యే అవకాశముందని తెలిపారు.
ఈ వర్గాలను ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం బిఎస్పీకే ఉందని, బహుజన సమాజం ఐక్యంగా ఉంటేనే సమాజంలో సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు. ఇప్పటి ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన దేశ సంపదను సమానంగా పంచడం లేదని మండిపడ్డారు. బహుజనులకు సంబంధించిన సంపదను కొన్ని ఆధిపత్య కులాల పార్టీలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. అగ్రవర్ణ ఆధిపత్య రాజకీయ పార్టీల మోసపూరిత వైఖరిని బహుజనులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భద్రాచలం నియోజకవర్గ సీనియర్ నాయకులు కొండా చరణ్, పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ జనగం కేశవరావు, వెంకటాపురం మండల అధ్యక్షుడు సొల్లేటి గణేష్ చారి, వాజేడు మండల అధ్యక్షుడు కారం చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.