21-04-2025 02:04:41 AM
అంతర్జాతీయ న్యాయస్థానం లొసుగును వాడుకున్న పాక్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: భారత నౌకాదళ మా జీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను పాకిస్తాన్ గూఢచర్య ఆరోపణలతో ఖైదు చేసి.. అతడికి మరణశిక్ష కూడా విధించింది. దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. 2019లో అంతర్జాతీయ న్యాయస్థానం జాదవ్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
జైలులో ఉన్న జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ హక్కును కల్పించాలని, ఆయనకు విధించిన మరణశిక్షను పునఃసమీక్షించాలని పాక్‌ను కోరింది. అప్పటి దాకా ఉరిశిక్ష అమలు చేసేందుకు వీల్లేదని తీర్పు వెలువరించింది. కానీ పాక్ మాత్రం కుల్‌భూషణ్‌కు అప్పీలు చేసుకునే హక్కు లేదని వాదిస్తోంది. ఈ విషయాన్ని పాక్‌కు చెందిన పత్రిక ‘డాన్’ కూడా ప్రచురించింది.
అతడికి అప్పీలుకు హక్కు లేదని పాక్ రక్షణ మంత్రిత్వ శాఖ న్యాయవాదే స్వయంగా ప్రకటించడం గమనార్హం. 2023లో పాకిస్తాన్ తెహ్రీక్ ఇటూ ఇన్సాఫ్ (పీటీఐ) నేత, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు సందర్భంగా అల్లర్లకు పాల్పడిన వారిని దోషులుగా నిర్దారిస్తూ అక్కడి సైనిక కోర్టులు తీర్పునిచ్చాయి.
ఈ తీర్పును కొంత మంది సుప్రీం కోర్టులో సవాలు చేయగా.. దీనిపై విచారణ జరిగింది. భారత పౌరుడు కుల్‌భూషణ్ జాదవ్‌కు ఉన్న అప్పీలు హక్కును కూడా పాక్ పౌరులకు ఇవ్వలేదని అల్లర్ల కేసులో నిందితులుగా తేలిన వారి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
దీనిపై రక్షణ మంత్రిత్వ శాఖ న్యాయవాది స్పందిస్తూ.. అప్పట్లో దేశ న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాన్ని గుర్తించి అంతర్జాతీయ న్యాయస్థానం జాదవ్‌కు కాన్సులర్‌తో మాట్లాడే అవకాశమిచ్చిందని, ఆ తీర్పు తర్వాత వియన్నా ఒప్పందానికి అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేసినట్టు వెల్లడించారు. ఇక ఇప్పుడు పునఃసమీక్షకు మాత్రమే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2023 అల్లర్ల కేసుకు సంబంధించి నిందితులు ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీల్ చేసుకునే హక్కును గురించి అటార్నీ జనరల్ అధికారులతో చర్చిస్తున్నారని సమయం ఇవ్వాలని రక్షణ మంత్రిత్వ శాఖ న్యాయవాది కోర్టును కోరారు.