01-04-2025 09:43:22 PM
ఏక కాలంలో 400 కళాకారుల నృత్యాలు..
మందమర్రి (విజయక్రాంతి): ఏకకాలంలో 400 మంది కళాకారులు కూచిపూడి నృత్యం చేసి కళా వైభవాన్ని చాటారు. జిల్లా కేంద్రంలోని పద్మావతి గార్డెన్ లో టాలెంట్ కల్చరల్ ఆర్ట్స్, సమిష్టి చేయూత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కూచిపూడి కళావైభవం పేరిట లార్జెస్ట్ కూచి పూడి డ్యాన్స్ ప్రదర్శించారు. తొమ్మిది నిమిషాల పాటు కళాకారులు నృత్యం చేస్తూ అలరించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడారు. కళలను ప్రోత్సహించి ప్రేరణ కల్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. టాలెంట్ కల్చరల్ ఆర్ట్స్ గౌరవ అధ్యక్షులు, సలహాదారులు ఉదారి చంద్రమోహన్ గౌడ్, దుర్గం రాజేష్ నేతకాని మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిలోనే కళలను ప్రోత్సహించే సంఘాలుండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ యాదవ సంఘము మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నల్వల సమ్మయ్య యాదవ్, జనసేన పార్టీ మంథని ఇంచార్జి మాయ రమేష్ లు మాట్లాడుతూ... కూచిపూడి నృత్యం తెలుగువారికి ఎంతో ఇష్టమైందని అన్నారు. మంచిర్యాలలో కూచిపూడి నృత్యరూపకం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టాలెంట్ కల్చరల్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు సునార్కర్ రాంబాబు నేతకాని ఆనందం వ్యక్తం చేశారు. గురువు కేంద్ర సంగీత సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వేదాంతం రామలింగ శాస్త్రి, నాట్య విశారద మాచిరాజు రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో కళాకారులు ఏకకాలంలో నృత్యం చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ రికార్డ్స్ లోకి ఎక్కారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ రికార్డ్స్ నిర్వాహకులకు సర్టిఫికెట్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి నృత్య గురువులు, టాలెంట్ కల్చరల్ ఆర్ట్స్ సలహాదారులు మడ్డి వేణుగోపాల్ గౌడ్, ఉపాధ్యక్షులు గడ్డం మానస, కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.