calender_icon.png 20 September, 2024 | 5:02 PM

‘దొంగే.. దొంగా దొంగా’ అన్నట్లు కేటీఆర్ వైఖరి

27-07-2024 12:05:00 AM

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి

కరీంనగర్, జూలై 26 (విజయక్రాంతి): ‘దొంగే.. దొంగా దొంగా’ అని అరిచినట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరి ఉందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ పాలనలో రూ.లక్షల కోట్ల ప్రజాధనంతో పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టార న్నారు. నేడు కేటీఆర్ ఏం ముఖం పెట్టుకుని ప్రాజెక్టులు సందర్శిస్తున్నారని మండిపడ్డారు. వర్షపాతం తక్కువగా కురిసినందున లోయర్ మానేర్ డ్యాం నిండలేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిండకపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమనడం విడ్డూరంగా ఉందన్నారు.

మేడిగడ్డ పిల్లర్లు కుంగడానికి కారణం నాటి సీఎం చంద్రశేఖర్‌రావేనని ఆరోపించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుతోందని, అందుకు కారణం తామేనని కేటీఆర్ చెప్పుకోవడం కోసం కేటీఆర్ ప్రాజెక్ట్‌లను సందర్శిస్తున్నారన్నారు. మున్ముందు బీఆర్‌ఎస్‌లో తండ్రీకొడుకులు మాత్రమే మిగులుతారని, మిగిలిన ఎమ్మెల్యేలంతా ఇతర పార్టీల్లో చేరతారని జోస్యం చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తాజుద్దీన్, కొరివి అరుణ్ కుమార్, శ్రవణ్‌నాయక్, అబ్దుల్ రెహమాన్, గుండాటి శ్రీనివాస్, పోరండ్ల రమేష్, విద్యాసాగర్, మెతుకు కాంతయ్య, ఖమ్రుద్దీన్, మ్యాకల నర్సయ్య, దండి రవీందర్ పాల్గొన్నారు.