calender_icon.png 24 October, 2024 | 5:03 AM

కేటీఆర్ x బండి

24-10-2024 02:26:24 AM

బండికి కేటీఆర్ లీగల్ నోటీసులు

  1. తన పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేశారని..
  2. వారం రోజుల్లో బేషరతు క్షమాపణలకు డిమాండ్
  3. లేకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటానన్న కేటీఆర్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. తన పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేశారని, వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు.

అక్టోబర్ 19న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ  తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని, బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డానని నిరాధారణ ఆరోపణలు చేశారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి కేసీఆర్ పేరును కూడా కేంద్రమంత్రి ప్రస్తావించారని నోటీసుల్లో పేర్కొన్నారు.

సంజయ్ కామెంట్స్ తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయన్నారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని, ఫోన్ ట్యాపింగ్ చేశానని, కేసుల నుంచి తప్పించుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డితో రహస్యంగా కలిసిపోయా నంటూ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని బండికి కేటీఆర్ సవాల్ చేశారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా తన పరువుకు భంగం కలిగిం చేలా వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్య లు తప్పవని హెచ్చరించారు.సంజయ్ చేసిన వ్యాఖ్యలు విస్తృతంగా మీడియా, సోషల్ మీడి యా ద్వారా ప్రచారం చేయబడ్డాయని, దీని కారణంగా ప్రజలు తనను తప్పుగా అర్థం చేసుకొనే ప్రమాదం ఉందని కేటీఆర్ అన్నా రు.

ఫోన్ ట్యాపింగ్ సహా డ్రగ్స్ ఆరోపణలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ‘కేవలం నన్ను అప్రతిష్ట పాలు చేయాలన్న దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సంజయ్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. అసత్య ప్రచారం చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా, క్రిమి నల్ ప్రొసీడింగ్‌ను ఎదుర్కొవాల్సి వస్తుంది’ అని లీగల్ నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు. 

నీకూ నోటీసులు పంపుతా.. కాచుకో..

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపిన లీగల్ నోటీసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ‘తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. రాజకీయంగా ఎదుర్కోలేక నోటీసులా.. విమర్శలకు నోటీసులే సమాధానమా, అయితే నీకు నోటీసులు పంపుతా.. కాచుకో. నువ్వు సుద్ధపూస అనుకుంటున్నావా.. నన్ను అవమానిస్తూ మాట్లాడితేనే బదులిచ్చిన.

మాటకు మాటతోనే.. నోటీసుకు నోటీసుతోనే జవాబిస్తా’ అంటూ సమాధానం ఇచ్చారు. కేటీఆర్ తనకు లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూసినట్లు తెలిపారు. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరని అన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీసు ఇవ్వడం చూస్తే జాలేస్తోందని పేర్కొన్నారు.

తనపై తొలుత వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరే అని చెప్పుకొచ్చా రు. అందుకు బదులుగానే తాను మాట్లాడినట్లు తెలిపారు. కేటీఆర్ భాగోతం ప్రజలకు తెలుసు అంటూ సెటైర్ వేశారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో అందరికీ తెలుసని పేర్కొన్నారు.

‘మేం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులం. చట్టం, న్యాయం ప్రకారం ముందుకువెళతాం’ అని  సంజ య్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవా రం  పత్రికా ప్రకటనను విడుదల చేశారు.