పాలమూరు ముద్దుబిడ్డకు ప్రాజెక్టుల పైన ప్రేమ లేదా..
-సిఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్న.
నాగర్ కర్నూల్, విజయక్రాంతి: పాలమూరు ముద్దుబిడ్డను అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన ప్రేమ లేదా అని మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. గతంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ప్రాజెక్టులు కట్టబెడుతున్నారంటూ గగ్గోలు పెట్టిన ప్రస్తుత ముఖ్యమంత్రి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు కాంట్రాక్టు ఎవరికి అప్పచెప్పారో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలోని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంటికి చేరుకొని లక్ష్మారెడ్డి భార్య శ్వేత లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరువు నేలను కల్పతరువుగా మార్చేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రూపకల్పన చేశారని దాదాపు 95% పనులు పూర్తికాగా కేవలం ఐదు శాతం పనులను పూర్తిచేసేందుకే ప్రస్తుత ప్రభుత్వం అష్ట కష్టాలు పడుతోందని మండిపడ్డారు. పాలమూరు ముద్దుబిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టు దాదాపు పూర్తికావస్తున్న ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఎందుకు చొరవ చూపడం లేదో చెప్పాలన్నారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం వెంకటాద్రి, కరివేన ఉద్దండాపూర్ వంటి రిజర్వాయర్లన్ని పూర్తయ్యాయని కేవలం నీటిని తరలించే సొరంగ మార్గాల్లో మాత్రమే కొంత పని పెండింగ్ ఉందన్నారు.
దాదాపు మోటార్ల బిగింపు ప్రక్రియ కూడా పూర్తయిందని ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ప్రజలకు కెసిఆర్ గుర్తొస్తాడన్న అక్కస్తోనే ప్రాజెక్టును పూర్తి చేయడం లేదన్నారు. గత పాలకులు పెండింగ్లో ఉంచిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత కెసిఆర్కే దక్కిందని గుర్తు చేశారు. కాంట్రాక్టు కమిషన్ల కోసమే ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పారని గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి, ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన కాంట్రాక్ట్ ఏజెన్సీకి పనులు అప్పగించారని మండిపడ్డారు. త్వరలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటన షురూ చేస్తామన్నారు. తమ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వారితోపాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితర ముఖ్య నేతలు ఉన్నారు.