హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నిర్వహించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిధుల సమీకరణకు ప్రభుత్వం ప్రమాదకరమైన మార్గం ఎందుకుందన్నారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన రూ.20 వేల కోట్ల భూముల తనఖాకు 400 ఎకరాలు తనఖా పెట్టి రూ.10 వేల కోట్ల సమీకరణకు యత్నిస్తున్నట్లు కేటీఆర్ ఆరోపించారు.
మధ్యవర్తిగా మర్చంట్ బ్యాంకర్ ను పెట్టి రూ.100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు సిద్ధమైందని చెప్పారు. మతిలేని చర్య వల్ల రాష్ట్ర ప్రగతి శాశ్వతంగా కుంటుపడే ప్రమాదం ఉందని, సరైన ప్రోత్సాహం లేక కంపెనీలు పక్కచూపులు చూస్తున్నాయన్నారు. రాజకీయ లబ్ధి కోసం భూములు తాకట్టు పెడితే కంపెనీలకు ఏమిస్తారు? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎక్స వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు.