calender_icon.png 17 March, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటన

17-03-2025 10:24:35 AM

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్

ఈ నెల 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు

అసెంబ్లీ సమావేశాల అనంతరం వరుసగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటన

బీఆర్‌ఎస్‌ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా, జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) నేతృత్వంలో తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో భాగంగా వరంగల్‌(Warangal)లో లక్షలాది మంది పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది.  పార్టీ సిల్వర్ జూబ్లీ(BRS Silver Jubilee ) కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు, సంబరాలను నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించబడింది. అదే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలును నిర్లక్ష్యం చేస్తున్న తీరుపై కూడా చర్చించేందుకు వ్యూహాత్మక కార్యాచరణ రూపొందించనున్నారు.  


ఈ క్రమంలో, ఈ నెల 20న సూర్యాపేట జిల్లా కార్యకర్తలతో, 23న కరీంనగర్ జిల్లా నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంతో పాటు, పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పరిచుకున్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సమావేశాల్లో మరోసారి గుర్తుచేసుకోనున్నారు.ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుని నిలబడ్డ పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో మళ్లీ ఉజ్వల భవిష్యత్తు ఉండబోతుందని కేటీఆర్ తెలియజేయనున్నారు. ఏడాదిన్నరలోనే తీవ్రమైన ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రస్తుతం తెలంగాణ ప్రజల భరోసా బీఆర్‌ఎస్‌ పైనే ఉందని, కేసీఆర్ నాయకత్వంపై మరింత నమ్మకంగా ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేయనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు ఆయన పర్యటనలు దోహదపడనున్నాయి.