22-03-2025 10:48:50 AM
హైదరాబాద్: తెలంగాణ మాజీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్(BRS Working President KTR) చెన్నైలో జరుగుతున్న అఖిలపక్ష భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్, కర్నాటక ఉపముఖ్యమంత్రి శివకుమార్ హాజరయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టంపై చర్చించనున్నారు. కాసేపటి క్రితమే చెన్నైలో డీలిమిటేషన్ పై డీఎంకే నేతృత్వంలో సమావేశం ప్రారంభం అయింది. తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన పార్టీలకతీతంగా అఖిలపక్ష భేటీ కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చెన్నై చేరుకున్నారు. చెన్నై వేదికగా డీలిమిటేషన్ పై మీటింగ్ కు ఏపీ నుంచి పార్టీల ప్రతినిధులు హాజరుకాలేదు. ఈ సమావేశానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డుమ్మా కొట్టారు.
చెన్నైలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... డీలిమిటేషన్ ప్రతిపాదన వలన ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయన్నారు. కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరిగి మరికొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం వలన అనేక ప్రాంతీయ అసమానతలు ఏర్పడి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. దక్షిణ భారతదేశానికి ఇచ్చే నిధుల కన్నా వచ్చే నిధులు మరింతగా తగ్గిపోతాయని ఆరోపించారు. కేంద్రం నుంచి అందే సహాయంతో పాటు దక్షిణాదికి రాజకీయ ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోతుందని విమర్శించారు.
భారతదేశ అభివృద్ధికి సహకరించిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం అన్యాయమన్న కేటీఆర్ జనాభా నియంత్రణ కోసం పాటుపడిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ ప్రతిపాదనను బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. భారతదేశ చరిత్రలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అత్యంత కీలకమైనవి తెలిపారు. ఈ అంశం పైన అందరము గట్టిగా కొట్లాడాలి.. వ్యతిరేకించాలి లేకుంటే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవని కేటీఆర్ సూచించారు. ఇప్పుడు మౌనంగా ఉంటే చరిత్ర మనల్ని క్షమించదన్న కేటీఆర్ అత్యంత కీలకమైన ఈ సందర్భంలో అందరూ కలిసి ఐక్యంగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు రాజకీయాలను సమూలంగా మార్చేటువంటి ఈ పరిణామం పైన అందరూ గళం విప్పాలని కోరారు.