- కేసుల నుంచి బయటపడేందుకే హస్తిన టూర్
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి) : ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై ఏసీబీ కేసు నమోదు చేస్తుందనే భయంతోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని.. అక్కడ ఆయనను పట్టించుకునే వారు కూడా ఉండరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం మంత్రుల సముదాయంలోని తన నివాసంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
మంత్రిగా ఉన్నప్పుడు మోడీ లేడు.. బోడీ లేడు అని మాట్లాడిన కేటీఆర్‌కు ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం పెద్ద జోక్ అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి రాష్ర్ట అభివృద్ధి కోసం కేంద్రమంత్రులను కలవడానికి చేతగాని కేటీఆర్.. కేసుల మాఫీ కోసం కొత్త నాటకానికి తెరతీశాడని విమర్శించారు. ఫార్మూల్ రేస్‌లో రూ.50కోట్ల ఓరల్ ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడంపై ఏసీబీ కేసు బుక్ చేసేందుకు గవర్నర్ అనుమతిచ్చారనే భయంతోనే ఢిల్లీకి వెళ్లాడన్నారు.
కేటీఆర్ ఫెమా, ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి రూపాయలను.. డాలర్లుగా మార్చి కన్సల్టెన్సీల కడుపు నింపిండని కోమటిరెడ్డి ఆరోపించారు. కేటీఆర్ తెచ్చింది ఒరిజినల్ ఫార్మూలా వన్ కాదని.. అదో పెద్ద డూప్లికేట్ అని అన్నారు. అమృత్-2.0 టెండర్లలో అవినీతి గురించి కేటీఆర్ మాట్లాడటం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని.. సుజన్‌రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి తోక చుట్టం కానీ.. కల్వకుంట్ల కవితకు దశబ్దానికిపైగా బిజినెస్ పార్ట్‌నర్ అని ఆరోపించారు.
ఇరిగేషన్ టన్నెల్ పనులు చేసింది వారేనని.. దానికి కేటీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తేజారాజుకు చెందిన గజా కన్‌స్ట్రక్షన్స్‌కు, ప్రతిమా శ్రీనివాసరాజుకు అమృత్ టెండర్లు ఇచ్చిందే కేటీఆర్ అని ఆరోపించారు. మేఘా కంపెనీకి టెండర్లు ఇచ్చింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు సహకరించినందుకు, తనను ఫార్ములా స్కాం నుంచి తప్పించమని అమిత్ షాను కలవడానికే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని కోమటిరెడ్డి ఆరోపించారు. గిరిజనులు,
ఆదివాసీల సంక్షేమం కోసం పనిచే సిన ప్రతీక్ జైన్‌పై దాడి బీఆర్‌ఎస్ మానసిక స్థితికి నిదర్శనమని మంత్రి అభివర్ణించారు. ప్రతీక్‌పై దాడి చేసిన బీఆర్‌ఎస్ కార్యకర్త సురేష్‌ను అధికార యంత్రాంగం గుర్తించిం దన్నారు. అమృత్ టెండర్లపై ఏ విచారణకైనా తాము సిద్ధమని, ‘కాళేశ్వరం’ నిర్మాణం లో జరిగిన అవినీతిపై విచారణకు కేసీఆర్ సిద్ధమా? అని సవాల్ విసిరారు.