calender_icon.png 27 April, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రజతోత్సవ సభపై పార్టీ నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్

26-04-2025 07:54:59 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఓరుగల్లు వేదికగా ఆదివారం జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ(BRS Silver Jubilee Meeting)కు గులాబీ సైనికులతో పాటు తెలంగాణ సబ్బండవర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party Working President KTR) పిలుపునిచ్చారు. ఈ సదర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి గ్రామంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఉదయాన్నే గులాబీ జెండాలు ఆవిష్కరించి కదలిరావాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ పార్టీకి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సభ కావడంతో, సభకు హాజరయ్యే వారు గులాబీ రంగు దుస్తులు ధరించాలన్నారు. 

రాష్ట్ర నలుమూలల నుంచి సభకు తరలిరావాలనే ఉత్సాహం ప్రజల్లో పెద్ద ఎత్తున ఉందని, వారందరినీ సమన్వయం చేసుకొని అనుకున్న సమయానికి సభా ప్రాంగణానికి చేరుకునేలా ప్రణాళిక వేసుకోవాలని తెలిపారు. పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు తరలివచ్చే ప్రతి వాహనానికి గులాబీ జెండాలు కట్టుకుని బయలుదేరాలని, ఎండల వల్ల ఇబ్బంది లేకుండా ప్రతి బస్సులో మంచినీళ్ల బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, భోజన వసతులకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

సభకు వచ్చే వాహనాలు ట్రాఫిక్ జామ్ కాకుండా రూట్ మ్యాప్ పంపించామని, దానికి అనుగుణంగానే ఆయా రూట్లలో సభ స్థలికి చేరుకోవాలని పేర్కొన్నారు. సభా ప్రాంగణానికి 30 కిలోమీటర్ల దూరం నుంచి రోడ్లపై ఎక్కడ వాహనాలు నిలపరాదని, సూచించిన పార్కింగ్ స్థలాలకు చేరుకొని వాహనాలను నిలపాలని వెల్లడించారు. అనేక ప్రాంతాల్లో పార్టీ వాలంటీర్లు ఎప్పటికప్పుడు మార్గ నిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉంటారని, సభకు చేరుకునే వారందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి చోట మంచినీటి బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు వాలంటీర్లు సిద్ధంగా ఉంటారన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొందని, రాష్ట్ర రాజకీయాల్లో ఈ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతోందని కేటీఆర్ స్పష్టం చేశారు.