calender_icon.png 14 November, 2024 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నా

13-11-2024 11:13:03 AM

హైదరాబాద్: పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మాజీ కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్రగా పేర్కొన్నారు. కార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారని కేటీఆర్ ఆరోపించారు. పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్ లు తప్పవని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్ట్ లతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుందన్నారు. రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్ట్ లు ఎన్నో చూసిందని గుర్తుచేశారు. ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తామని వ్యాఖ్యానించారు.