calender_icon.png 28 January, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్.. పగటి కలలు మానుకో

07-12-2024 03:13:08 AM

  1. పదేళ్లలో చేసిన దోపిడీ అంతా ఇంతా కాదు 

ప్రజలు మళ్లీ బీఆర్‌ఎస్‌కు అధికారం ఇవ్వరు 

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ధ్వజం

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి, రాజీవ్‌గాంధీ విగ్రహాలను వేటి స్థానంలో వాటిని ఉంచుతామని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ పగటి కలలు కనటం మానుకోవాలని ఆయన సూచించారు. రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని కాజేసిన మిమ్మల్ని ప్రజలు మళ్లీ అధికారంలోకి తెస్తారని ఎలా అనుకుంటున్నారని ప్రశ్నించారు.

గాంధీభవన్‌లో ఆయన ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అమీర్‌అలీఖాన్, పార్టీ నేతలు లింగంయాదవ్, రామ్మోహన్‌రెడ్డితో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పదేళ్లలో చేసిన దోపిడీ అంతా ఇంత కాదన్నారు. ’మీరు పెడితే తెలంగాణ తల్లి విగ్రహం.. మేం పెడితే కాంగ్రెస్ తల్లి విగ్రహం అవుతుందా?’ అని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి దృఢసంకల్పంతో తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్కృతి, కట్టుబాట్లను ప్రతిబింబించేలా ఉంటుందన్నారు.

రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నందునే ప్రభుత్వం పండుగను నిర్వహిస్తోందన్నారు. సోమవారం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరుకావాలని మహేశ్‌కుమార్‌గౌడ్ కోరారు. 

అరెస్ట్ డ్రామాకు తెరలేపారు.. 

బీఆర్‌ఎస్ నేతలు అరెస్టు డ్రామాకు తెరలేపారని పీసీసీ చీఫ్ విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలో విధించిన ఆంక్షలను ఒక్కసారి గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌ను ఎత్తివేశారని, ప్రజలు, ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా అరెస్టులు, గృహ నిర్బంధాలు చేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి ధర్నాచౌక్‌ను తెరిపించారని.. హౌస్ అరెస్టులు లేవన్నారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడే భాష మంచిగా లేదని, ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ఆయనను మందలించడం లేదా? అని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ నాయకులు చేసిన దోపిడీలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని.. ఈక్రమంలోనే హరీశ్‌రావుపై చీటింగ్ కేసు నమోదైందన్నారు. ధర్నాచౌక్ వద్ద ధర్నా చేయకుండా అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేయడమేంటి? అని ఆయన నిలదీశారు. ఈ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ మనుగడ ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు.