హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రైతు మహా ధర్నా(BRS Party Rythu Maha Dharna) లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) పాల్గొని ప్రసంగించారు. రైతులను రుణమాఫీ పేరిట రేవంత్ రెడ్డి మోసం చేసిండు. రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేసేందుకు డిసెంబర్ 9న సంతకం పెడుతా అన్నాడు. కానీ పూర్తిగా రుణమాఫీ కాలేదు. నీకు నిజాయితీ ఉంటే.. నీ సొంతూరు కొండారెడ్డిపల్లెకు పోదాం.. కొడంగల్‌కు పోదాం.. రుణమాఫీ అయిందని చెప్తే రాజీనామా కాదు రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీలో చెప్పాను. ఉలుకు పలుకు లేదు. రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే.. డేట్, ప్లేస్, టైమ్ నీ ఇష్టం.. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపించు. వంద శాతం రుణమాఫీ అయిందని రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేసి పోతామన్నారు. చారాణా రుణమాఫీ కూడా కాలేదు. కానీ ఇవాళ డిల్లీకి పోయి రుణమాఫీ చేసిన అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
కేసీఆర్ మీకు బిచ్చమేసినట్టు రైతుబంధు కింద రూ. 10 వేలు ఇస్తుండు.. నన్ను గెలిపిస్తే రూ. 15 వేలు ఇస్తానని అన్నాడు. ఏడాది దాటిపోయింది.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎన్నికలప్పుడు రూ. 7600 కోట్లు రైతుబంధు వేసేందుకు మేం సిద్ధమైతే ఈసీకి రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండని పేర్కొన్నారు . ఈ టైమ్‌లో వేస్తే కేసీఆర్‌కు ఓట్లు వేస్తారని చెబితే మోదీ ప్రభుత్వం ఆపింది. ఎన్నికలు అయిపోయాక రైతులను ఇబ్బంది పెట్టిండని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నాట్లప్పుడు రైతుబంధు పడుతుండే.. ఇప్పుడు ఓట్లప్పుడు పడుతున్నాయి. కేసీఆర్ జమ చేసిన రూ. 7600 కోట్లను పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లప్పుడు వేసిండన్నారు. వానాకాలం పంటకు రైతుబంధు ఇవ్వలేదు. అందుకే ఇవాళ ధర్నా పెట్టాం. ఎందుకంటే.. ఇది ప్రారంభం మాత్రమే.. రాష్ట్రమంతా ధర్నాలు పెడుతామని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 15 వేలు రైతుభరోసా ఇవ్వాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వానాకాలం రైతుబందును ఎగ్గొట్టిండు.. దాన్ని కూడా విడిచి పెట్టొద్దు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆరు గ్యారెంటీలు(Congress six guarantees) అమలు చేశారా?.. ఆరుగ్యారెంటీలని.. అర గ్యారెంటీ అమలు చేశారని ఎద్దేవా చేశారు. కేవలం ఉచిత బస్సు ప్రయాణం(Mahalakshmi scheme free bus)తో సరిపెట్టుకున్నారని చమత్కరించారు. గతంలో రైతు బందుకు అడ్డుగా పిటిషన్ వేశాడని ఆరోపించారు. రైతులకు రూ. 15 వేలు ఇస్తామని మాటిచ్చారు. ఒక్కో రైతుకు ఎకరానికి రూ. 17.500 లు బాకీ పడ్డారని చెప్పారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేసి, తెలంగాణను మొత్తం ఉద్దరించేసినా, ఢిల్లీని కూడా ఉద్దరిస్తానని అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. అమ్మకు అన్నం పెట్టనోడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అని ప్రశ్నించారు. సర్పంచ్, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెసోళ్లు మీ ఇండ్లకు వస్తారు.. రేవంత్ రెడ్డి రైతు భరోసా కింద ఎకరానికి రూ. 17,500 చొప్పున బాకీ ఉన్నాడని, బాకీ ఉన్నోడ్ని అడిగినట్టు గల్లా పట్టుకుని అడగండని కేటీఆర్(KTR) సూచించారు.