హైదరాబాద్,(విజయక్రాంతి): సీతారామ ఎత్తిపోతల పథకం పనులకు అనుమతులు లేకుండానే టెండర్లను ఎలా పిలిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీల పనుల్లో నిబంధనలు తుంగలో తొక్కారని కేటీఆర్ వివర్శించారు. త్వరగా టెండర్లు పిలవాలని ఒక మీటింగ్ లో ఆదేశించి, మరో మీటింగ్ లో అలాంటిదేమీ లేదంటూ మాయ మాటలు చెప్పారన్నారు.
కోటి ఎకరాలకు జీవం పోస్తున్న కాళేశ్వరంపై కమిషన్ వేశారు. ఇప్పుడు మీపై ఏ కమిషన్ తో విచారణ చేయించాలని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారుల జీవితాల్లో కాంగ్రెస్ సర్కార్ మట్టికొట్టిందన్నారు. తెలంగాణ లో చేప కథ ముగిసిన అధ్యాయమేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. నడుమంత్రపు పాలనలో నెర్రలు భారిన నీలి విప్లవం, రాష్ట్రంలో 20 వేల టన్నుల మత్య్ససంపద దిగుబడిపై ఇందిరమ్మ రాజ్యం కక్షగట్టిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం మారితే పథకాల పేర్లు మారుతాయి.
కానీ కాంగ్రెస్ పాలనలో పథకాలే నామరూపాలు లేకుండపాయని ఎక్స్ వేదికగా విమర్శించారు. మూసి మురికిలో కోట్లు కుమ్మరించడంపై ఉన్న ప్రేమ.. జలాశయాల్లో జలపుష్పా(చెపలు)లను వదలడంలో లేకపాయే అని ఆరోపించారు. మూసి పేరుతో పేదల ఇల్లు కూల్చి రాక్షస ఆనందం పొందే మీకు, ఉపాధి లేక బోసిపోయిన బెస్త వాడలపై లేకపాయే, హైడ్రా పేరుతో హైద్రాబాద్ ఖ్యాతిని మంటగలుపుతున్న మీకు, ముదిరాజ్ సోదరుల దీన స్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం పట్టింపే లేదని పోస్టులో కేటీఆర్ వెల్లడించారు.