calender_icon.png 23 September, 2024 | 12:43 PM

ప్రభుత్వం వాస్తవాలను ఎందుకు దాస్తోంది: కేటీఆర్

23-09-2024 10:44:45 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలు దిగజారుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని వైద్యసేవలపై దర్యాప్తు చేసేందుకు మాజీ ఆరోగ్య మంత్రి డా.రాజయ్య, మాజీ ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే డా.సంజయ్ నేతృత్వంలో నిపుణులైన ముగ్గురు వైద్యులతో నిజనిర్ధారణ బృందాన్ని బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసింది. అనుభవజ్ఞులైన వైద్యులతో కూడిన నిజనిర్ధారణ బృందాన్ని అడ్డుకోవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుందుడుకు ప్రయత్నం పారదర్శకత, జవాబుదారీతనంపై కఠోరమైన దాడి అని ఆయన ఎద్దెవా చేశారు. తెలంగాణ ప్రజలకు ఏం దాస్తున్నారు? గాంధీ ఆసుపత్రిలో పెరుగుతున్న శిశు మరణాలు, నిర్లక్ష్యాన్ని విచారిస్తున్న బీఆర్ఎస్ కమిటీ సభ్యులను ఈ తీరగా అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ కమిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచన గాంధీ ఆసుపత్రి నుండి మొదలుకొని, రాష్ట్రంలోని ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఏమి జరుగుతుందో పరిశోధించడమే బీఆర్ఎస్ ఉద్దేశ్యం అన్నారు.

అత్యంత అనుభవజ్ఞులైన ముగ్గురు కమిటీ సభ్యుల నివేదిక ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రమే సహాయపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వమా? ఆరోగ్య సంరక్షణలో ప్రభుత్వ విపత్కర వైఫల్యానికి జవాబుదారీగా ఉంటామని భయపడుతున్నారా? అని, వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు ఏమనుకున్నా నిజాన్ని బుల్‌డోజ్‌తో పాతిపెట్టలేమని, నిజానిజాలు బయటపెట్టే వరకు బీఆర్‌ఎస్‌ విశ్రమించదని కేటీఆర్ చెప్పారు.