12-03-2025 12:40:11 PM
హైదరాబాద్: గాంధీభవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లా గవర్నర్ ప్రసంగం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(BRS Working President KTR) విమర్శించారు. గవర్నర్ నోటి వెంట ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని కేటీఆర్ ఆరోపించారు. గవర్నర్ స్థాయిని దిగజార్చి కాంగ్రెస్ ప్రభుత్వం తన భ్రష్టత్వాన్ని చాటుకుందని కేటీఆర్ ద్వజమెత్తారు. రైతులకు ఊరటనిచ్చే ప్రకటన ఉంటుందని ఆశించామని ఆయన తెలిపారు. లక్షల ఎకరాల్లో పంట ఎండుతుంటే కనీసం పట్టించుకునే మంత్రి లేరు.. ఎండుతున్న ప్రతి ఎకరానికి సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యతన్నారు. 20 శాతం కమీషన్ అడుగుతున్నారని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు. డిప్యూటీ సీఎం ఆఫీసు ముందే ధర్నా చేసే పరిస్థితి దేశంలో ఎక్కడా లేదని మండిపడ్డారు.
రూ. 1.60 వేల కోట్ల అప్పు చేసి ఒక్క కొత్త పథకం కూడా అమలు చేయలేదని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) చురకలంటించారు. దావోస్ లో రూ. 1.79 లక్షల కోట్లు పెట్టుబడులపై శ్వేతపత్రం ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కమీషన్లు, ట్యాక్స్ లు తట్టుకోలేక నిర్మాణ రంగా కుదేలైందని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగంలో ప్రతి పదం అబద్ధం.. ప్రతి మాట ఆసత్యం అన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ప్రభుత్వం మోసం చేసింది, అవమానించిందని కేటీఆర్ పేర్కొన్నారు. కులగణన పేరుతో బీసీల సంఖ్యను తగ్గించారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఒక్క బీసీ బిడ్డ అయినా ప్రభుత్వ లెక్కలతో ఏకీభవిస్తున్నారా? అని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.