హైదరాబాద్,(విజయక్రాంతి): గత బీఆర్ఎస్ పాలనలో ఏడాదికి 16 వేల ఉద్యోగాలు ఇచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం(BRS Party Student Wing) క్యాలెండర్‌ను కేటీఆర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్(KT Ramarao) మాట్లాడుతూ... ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ(Congress Party) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ఏడాదికి 12 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని, పెట్టుబడిదారులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మేపరిస్థితి లేదని కేటీఆర్ ఆరోపించారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. కానీ 2021లో ఇప్పటి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ చేశారని ఆయనే స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారని తెలిపారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చామని, ఆ కార్యక్రమాన్ని పేదవాళ్ళకు పనికొచ్చే కార్యక్రమంగానే చూశాం తప్ప.. రేవంత్ రెడ్డి చేసినట్లు ప్రభుత్వ పైసలతోని, పెద్ద పెద్ద సభలు పెట్టి సన్నాయి నొక్కులు నొక్కలేదని కేటీఆర్ విమర్శించారు.